టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చాక పార్టీ బలోపేతం పై కేసీఆర్ దృష్టి పెట్టారు. మహారాష్ర్టలో కూడా ఇప్పటికే అడుగు పెట్టారు. తాజాగా మహారాష్ర్ట బీఆర్ఎస్ ఇన్ చార్జిని ప్రకటించారు. ఆయనెవరో కాదు. సీఎం కేసీఆర్ అన్న కల్వకుంట్ల రంగారావు కుమారుడు వంశీధర్ రావు. మహారాష్ర్టలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరు బీఆర్ఎస్ లో క్రియాశీలక పాత్రలోకి వచ్చేశారు. వంశీధర్ 2009 లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల కేసీఆర్ తో మమేకమవుతున్నారు. కల్వకుంట్ల రంగారావుకు ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. అయితే రంగారావు కూతురు రమ్యారావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. రంగారావు ఫౌండేషన్ ద్వారా సిద్ధిపేట లో వంశీధర్ రావు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు అనూహ్యం మహారాష్ర్ట ఇన్ చార్జిగా కీలక బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈయనతో పాటు 15 మందితో స్టీరింగ్ కమిటీ ని కూడా నియమించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్సు తివారీ ప్రకటించారు.
మహారాష్ర్టలో పార్టీ బలోపేతం పై సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే కమిటీలు, అనుబంధ కమిటీల నిర్మాణంపై దృష్టి పెట్టారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ ఈ మేరకు శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. స్టీరింగ్ కమిటీతో పాటు ఇప్పటికే ప్రకటించిన సమన్వయ కమిటీలు కలిసి పని చేసి, పార్టీ బలోపేతానికి కార్యచరణ రూపొందిస్తాయి.