
Sr. NTR : నందమూరి తారక రామరావు.. తెలుగోడి పౌరుషమతడు.. గొప్పనటుడిగా, రాజకీయ నాయకుడిగా, తెలుగు రాష్ర్టాల ప్రజలు అన్నగారు అని ముద్దుగా పిలుచుకునే నేత ఆయన. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించి ఔరా.. ఇది కదా తెలుగు చరిత్ర అని నిరూపించిన నటసార్వభౌముడు ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు..పాత్ర ఏదైనా తనకే సరిపోయేలా ఉండేది. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటవిశ్వరూపం ఎన్టీ రామారావు.
1923 మే 28న ఎన్టీఆర్ ఏపీలోని కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. చదువంతా విజయవాడలోనే కొనసాగింది. ఆతర్వాత నాటకాలు వేయడం ప్రారంభించాడు. 1942 మే నెలలో తన 20 ఏండ్ల వయసులో తన మేనమామ కూతురు బసవతారకాన్ని వివాహం చేసుకున్నారు. వీరికి ఏడుగురు కొడుకులు, ఐదుగురు బిడ్డలు. అయితే 1947లో డిగ్రీ పూర్తయ్యాక రామరావు మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి మంగళగిరిలో సబ్ రిజిస్ర్టార్ గా ఉద్యోగం సాధించాడు. అంతకుమేందు పాలవ్యాపారం, కిరాణా కొట్టు, ముద్రణాలయాన్ని నడిపారు.
ప్రముఖ నిర్మాత బీఏసుబ్బారావు తొలిసారిగా ఎన్టీఆర్ కు సినిమాల్లో నటించే అవకాశం కల్పించారు. పల్లెటూరి పిల్ల సినిమా తన మొదటి చిత్రం. ఇందుకు గాను ఎన్టీఆర్ కు 1016 రూపాయలు పారితోషంగా ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఇక తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ వెనుతిరిగి చూసుకోలేదు. ఎన్నో చిత్రాలతో ప్రజలను అలరించారు. మనదేశం, పాతాళబైరవి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం, మాయాబజార్, భూ కైలాస్, రావణబ్రహ్మ, వెంకటేశ్వర మహత్యం, లవకుశ లాంటి చిత్రాలు ఆయనను అగ్రభాగాన నిలిపాయి. పురస్కారం లక్షల్లోకి చేరింది. తర్వాత సీతారామ కళ్యాణం, దానవీర శూర కర్ణ, శ్రీరామ పట్టాభిషేకం అడవి రాముడు, యమగోల, నర్తన శాల, బ్రహ్మర్షి విశ్వామిత్ర, ఎన్నో చిత్రాలను తెలుగు చిత్రసీమకు అందించాడు.1968లో ఆయను పద్శశ్రీ అవార్డును కేంద్రం అందించింది.
ఏపీలో ప్రభుత్వాల మార్పు పై ఢిల్లీలో నిర్ణయాలు జరగడం ఎన్టీఆర్ కు సహించలేదు. ఇక తానే స్వయంగా ప్రజాసేవలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. 1982 మార్చిలో తానే స్వయంగాతెలుగుదేశం పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఇక చైతన్య రథం అనే వాహనం ద్వారా రాష్ర్టమంతా తిరిగారు. తన ప్రసంగాలతో తెలుగు ప్రజల్లో చైతన్యం తెచ్చారు. 1983 జనవరి 7న వచ్చిన ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో తెలుగు దేశం ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 199 సీట్లను గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2 రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం పథకాలు సంచలనంగా మారాయి. ఆ తర్వాత నాదెండ్ల, లక్ష్మీ పార్వతి వ్యవహారం ఎన్టీఆర్ కు తీవ్ర వివాదాన్ని తెచ్చి పెట్టాయి.
నాదెండ్ల భాస్కర్ రావు కారణంగా ప్రభుత్వం పడిపోతే ప్రజల్లోకి వెళ్లి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని గెలుచుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడంతో కుటుంబంలో విభేదాలు పెడచూపాయి. ఇవే చంద్రబాబును పార్టీలో చీలిక తెచ్చేలా నడిపించాయి. రాజకీయ వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి జోక్యం చేసుకోవడం ఎవరికీ నచ్చలేదు. దీంతో పార్టీ రెండుగా చీలింది. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 1996 జనవరి 18న తన 73 ఏండ్ల వయస్సులో ఎన్టీఆర్ గుండెపోటుతో మృతి చెందారు. ఇప్పటికే ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్నారు. ఈనెల 28న ఆయన శత జయంత్యుత్సవాలను తెలుగు రాష్ర్టాల్లో అభిమానులు, పార్టీ శ్రేణుల ఘనంగా జరుపుకుంటున్నారు.