Congress Strategy :
కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డింది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సఫలమైంది. తద్వారా ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి, గద్దెనెక్కింది. ప్రజలకు పలు సంక్షేమ పథకాల వరాలు ప్రకటించి, వాటిని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లడంలో ఆ పార్టీ వ్యూహకర్త, శ్రేణులు, నాయకులు సఫలీకృతులయ్యారు. అయితే ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్న కారణంగా ఇదంతా కర్ణాటకలో సాధ్యమైంది.
ఇదే సమయంలో తెలంగాణలో కూడా కర్ణాటక ఫార్మూలాను అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అయితే ఇక్కడ ఆ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు. దీంతో పాటు ఆ స్థాయిలో మంచి అభిప్రాయం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై లేదు. కానీ దీనిని క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా అంటే అనుమానంగానే ఉంది. ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ లో జోష్ తగ్గింది. అనుకున్నంత స్థాయి ఊపు కనిపించడం లేదు. అయితే బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎదిగిన మాట వాస్తవమే. కానీ క్షేత్రస్థాయిలో అంత పటిష్టంగా ఉందనే వాదనను రాజకీయ విశ్లేషకులు ఒప్పుకోవడం లేదు. దీంతో పాటు గెలిస్తే పార్టీ ఏం చేస్తుందనడానికి ప్రజల్లో ఎక్కడా కూడా బలమైన విశ్లేషణ లేదు.
అయితే కాంగ్రెస్ ప్రధానంగా ఐదు పథకాలను తెరపైకి తెస్తున్నది. ఒకటి చేయూత ద్వారా రూ. 5 వేల పింఛన్. 2. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ 3. రూ. 500 కే వంటగ్యాస్ సిలిండర్ 4. కొత్తింటికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం 5. ఏటా 2 లక్షల ఉద్యోగాలు అయితే వీటితో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు రాబట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ రూ. 4 వేల పింఛన్ను దివ్యాంగులకు ఇస్తున్నట్లు ప్రకటించింది. రైతులకు ఎలాగూ 24 గంటల విద్యుత్ అంటూ ఎలాగూ నమ్మిస్తున్నది. అయితే ఇందులో ఆర్థిక సాయం, ఉద్యోగాల హామీ అంశం మాత్రమే కాంగ్రస్ కొత్తగా వినిపిస్తున్నది. ఇవి రెండు కూడా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. అయితే రాష్ర్టంలో బీఆర్ఎస్ ఏ మాత్రం బలహీనంగా లేదు. గ్రామాల్లో బలమైన క్యాడర్ ఉంది. ఒక అభ్యర్థుల విషయంలో మినహా ఎక్కడా ఆ పార్టీని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. అయితే కాంగ్రెస్ ఏ స్థాయిలో ఢీకొడుతుందనడానికి అంచనాలు లేవు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు నెలల సమయం సద్వినియోగం చేసుకుంటే కొంత మేలు కలుగుతుంది. లేదంటే ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది.