
రాష్ట్ర మంత్రివర్గం గురువారం (మే 18) రోజున సమావేశం కానుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఇదే మొదటి కేబినేట్ భేటీ కానుంది. ఇందుకు సాధారణ పరిపాలన శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎజెండాలో 20కి పైగా అంశాలు ఉండే అవకాశం ఉంది. అయితే సీఎం కేసీఆర్ అనుమతితో ఎక్కువ అంశాలు ఎజెండాగానే సమావేశం ముందుకు రానుంది. మంత్రి వర్గంలో చర్చించి పాలనా పరమైన కొత్త నిర్ణాయలు తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ నేతృత్వంలో కొత్త సచివాలయంలో మొదటిసారి సమావేశం కానుంది. మంజీరా కార్పొరేషన్ ఏర్పాటు ఆమోదం, ర్యాటిఫికేషన్ కోసం అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లాంటి ఫైల్స్‌తో సహా మొత్తం 20కి పైగా అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది.
దశాబ్ది వేడుకలపై సీఎం దిశానిర్ధేశం..
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించాలని సీఎం నిర్ణయించిన నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణపై కేబినేట్ మీట్ లో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. వేడుకల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి సమాలోచనలు జరిపి మంత్రులు, అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్మారక స్తూపం ప్రారంభ తేదీ కూడా ఈ సమావేశంలో ఖరారయ్యే అవకాశం ఉంది. పోడు భూముల పట్టాల అంశంపై కూడా స్టేటస్ రిపోర్ట్ చర్చకు రానున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 1.50లక్షల మంది ఆదివాసీలు, గిరిజనులకు సుమారు 4 లక్షల ఎకరాల పోడు భూమికి సంబంధించిన పట్టాలను పంచే కార్యక్రమానకి సంబంధించి తేదీని ఈ సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలుస్తుంది. ‘గృహలక్ష్మీ’ మార్గదర్శకాలపై మంత్రి వర్గం మరింత లోతుగా చర్చించి ఆమోదం తెలుపుతుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పేర్ల ఆమోదం..
గవర్నర్ కోటా కింద నామినేటెడ్ ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, ఫారూఖ్ హుస్సేన్ పదవీకాలం మే 27తో ముగుస్తుంది. ఆ కోటా కింద ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ అమోదించి గవర్నర్ సిఫారస్ కోసం పంపే అవకాశం ఉంది. కర్ణాటక ఫలితాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరలో ఇక్కడ కూడా ఎన్నికలు వస్తుండడంతో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
21 రోజుల పాటు జరిగే శతాబ్ధి ఉత్సవాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రులకు ఈ సమావేశం ద్వారా సీఎం కేసీఆర్ రోడ్ మ్యాప్‌ను ఇచ్చే అవకాశం ఉంది.