- నేడు కీలక ప్రకటన?

CM KCR : తెలంగాణలో బుధవారం కీలక భేటీ జరగబోతున్నది. ఎలాంటి సంచలన నిర్ణయమైనా వెలువడే అవకాశం ఉందనే చర్చ కొనసాగుతున్నది. నేటి మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో ఈ మీటింగ్ ఉండబోతున్నట్లు సమాచారం.. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఎన్నికల జోష్ కనిపిస్తున్నది. హ్యాట్రిక్ ఖాయమనే ధీమాను ఆ పార్టీ నాయకులు ముందునుంచే వినిపిస్తున్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపు, సంక్షేమ పథకాలు తమ విజయానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మూడ్ ఒక్కసారిగా మారిపోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది..
ఇంతకీ ఏం జరగబోతుంది..
ఈ ఏడాదే రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ మత రాజకీయాలకే పరిమితమవడంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లిపోతుంది. ఇక ఎంతో కొంత ప్రాబల్యం ఉన్న కాంగ్రెస్ లో లుకలుకలతో కేసీ ఆర్ కు మళ్లీ గెలుపు సునాయసమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ మీటింగ్ కు హాజరవ్వాలని ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు పిలుపు అందింది. ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ , వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగానే ఈ సమావేశం ఉంటుందని టాక్.
అక్టోబర్ లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో ఈలోగా తీసుకోవాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ కు దూరమయ్యారని భావిస్తున్న కొన్ని వర్గాలను ఆకట్టుకునేలా నిర్ణయం ఏదైనా వెలువడే అవకాశముందేమోనని భావిస్తున్నారు. అయితే అక్టోబర్ లోనే ఎన్నికల కు వెళ్లే అవకాశముందని , ముందస్తు లాంటి ప్రణాళికలేం ప్రస్తుతానికి లేవని చెబుతున్నారు. జూన్ 2న రాష్ర్ట ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. ఇక త్వరలోనే కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత దక్కింది.