
KCR new strategy : తెలంగాణ రాష్ట్రంలో ఆగస్ట్ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. అందుకు ప్రతీ నాయకుడు సిద్దంగా ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం నాయకులను ఆదేశించింది. దానికి గడువు ఇంకా 100 రోజులు మాత్రమే ఉంది. దీంతో కొత్త స్ట్రాటజీకి తెరలేపుతున్నారు కేసీఆర్. రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు అనంతరం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధినేత ఆదేశించారు. తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు .
ఈ సారి ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేయాలని అలర్ట్ చేశారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్య ప్రదేశ్ ఇంకా రెండు రాష్ట్రాలకు ఆగస్ట్ లోనే కోడ్ రిలీజ్ చేసేందుకు ఎన్నికల కమిషన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లోపే ప్రచారాన్ని వేగవంతం చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమలైతే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టతరమవుతుంది.
ఈ మేరకు రెండు నెలల్లోనే అన్నీ చక్కబెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. పెండింగ్ లోని అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వంలోని లోపాలను కూడా సరిదిద్దుకోవాలని అనుకుంటుంది గులాబీ పార్టీ. ప్రచారం, ప్రజల్లో నెగెటివ్ తొలగించేందుకు చేపట్టాల్సిన పనులపై కూడా కేసీఆర్ స్వయంగా నాయకులకు క్లాసులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక నాయకులు ఎలా ప్రచారం చేయాలన్న దానిపై కూడా ఆయనే షెడ్యూల్ విడుదల చేయనున్నారు. వీటిని వివరించేందుకు మంత్రుల నుంచి జిల్లా కమిటీల వరకూ సమావేశాలు నిర్వహిస్తున్నారు కేసీఆర్.
ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా ప్రచారం మొదలు పెట్టిన నేతలు, జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నుంచి వేగం పెంచుతారు. అందుకు తగ్గట్లుగా కేసీఆర్ ఇప్పటికే సంబంధిత నాయకులకు సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. ఈ సారి వ్యతిరేకను పక్కను నెట్టి హ్యాట్రిక్ సాధించేలా కష్టపడాలని నేతలను ఆదేశిస్తున్నారు.