Kidnapping : పెండ్లయిన ప్రియుడిని అపహరించిందో యువతి.. ఆయనతో బలవంతంగా తాళి కట్టించుకుంది. ఆ తర్వాత పోలసుల రంగ ప్రవేశంతో సీన్ మారింది. ఈ ఘటనలో యువతి, ఆమెకు సహకరించిన ముగ్గురు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.
పెండ్లయిన ప్రియుడిని అపహరించి అతడితో బలవంతంగా తాళి కట్టించుకుంది. చెన్నై వేలచ్చేరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పార్తిబన్, రాణిపేటకు చెందిన సౌందర్య కళాశాలలో చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. అనంతరం విడిపోయారు. ఇక పార్తిబన్ మరో వివాహం చేసుకున్నారు. గతనెల 5న ఐటీ ఉద్యోగం చేసే ఓ యువతిని ఆయన వివాహం చేసుకున్నారు. అయితే సౌందర్య మాత్రం పార్తిబన్ ను మర్చిపోలేనని, అతడినే వివాహం చేసుకుంటానని తన తల్లి , బంధువులతో చెప్పింది. దీంతో ఆమె తల్లి ఉమ, బంధువులు రమేశ్, శివకుమార్ తో కలిసి యువకుడిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేసింది. పక్కాగా అమలు చేసింది.
శుక్రవారం ఉదయం కార్యాలయానికి బయలుదేరిన పార్తిబన్ ను కారులో వచ్చి అపహరించారు. నేరుగా కాంచీపురంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. కిడ్నాప్ విషయంపై యువకుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. మాజీ ప్రియురాలు సౌందర్య, ఆమె బంధువులే అపహరించారని వారిని అదుపులోకి తీసుకున్నారు.