Kids Home Work : పిల్లలు ఆడుకోవడానికి, ఫోన్లలో వీడియోలను చూడడానికి, వీడియో గేమ్స్ ఆడడానికి చూపినంత శ్రద్ధ హోంవర్క్ చేయడానికి చూపించరు. కొంతమంది పిల్లలు.. స్కూల్ అయిపోయి ఇంటికి రాగానే.. బుద్ధిగా కూర్చుని హోంవర్క్ పూర్తి చేసేస్తుంటారు. అయితే, కొందరు పిల్లలు మాత్రం హోంవర్క్ పూర్తి చేయడానికి అసలు ఇష్టపడరు. వీళ్లతో హోంవర్క్ చేయించడానికి.. పేరెంట్స్ నానా తంటాలు పడుతుంటారు. ప్రతిరోజూ పిల్లలతో హోంవర్క్ చేయించడం వారికి ఓ సవాల్‌గానే ఉంటుంది. కొందరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగు పక్కన పడేసి ఆటలాడేందుకు పరుగెత్తుతారు. ఉదయం లేవగానే హోంవర్క్ చేయలేదనే విషయం గుర్తొచ్చి, టీచర్ తిడుతుందని లేదా కొడుతుందని స్కూల్‌కి వెళ్లనంటూ మారాం చేస్తారు. ఒక వేళ వెళ్లినప్పటికీ టీచర్ హోం వర్క్ ఎందుకు చేయలేదని అడినందుకు.. కడుపులో నొప్పనో, జ్వరం వచ్చిందనో, కుక్క నా హోం వర్క్ పాడు చేసిందనో ఇలా ఫన్నీ కారణాలు చెబుతూ తప్పించుకుంటారు.
అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తల్లిదండ్రులు హోంవర్క్ సులభంగా పూర్తి చేయించవచ్చు. వాస్తవానిని పిల్లల చదువులో హోంవర్క్ కీలకమైన అంశం. ఇది క్లాస్ రూమ్ అభ్యాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అధ్యయన నైపుణ్యాలను మెరుగు పరుస్తుంది. బాధ్యత, టైమ్ మేనేజ్‌మెంట్ అలవాటు అవుతుంది. మీ చిన్నారి హోంవర్క్ చేయడానికి మారం చేస్తుంటే.. కొన్ని టిప్స్ మీ చాలా హెల్ప్ అవుతాయి. అవేంటో చూద్దాం.
* ప్రతిరోజూ పిల్లలు స్కూల్ నుంచి రాగానే టీచర్లు ఏం చెప్పారు? చేయాల్సిన హోంవర్క్ ఏంటి? అనే విషయాలను అడిగి కనుక్కోవాలి.
* హోంవర్క్ చేసే సమయంలో పిల్లలకు చాలా డౌట్స్ వస్తుంటాయి. అలాంటపుడు దగ్గరుండి వారి డౌట్లను తీర్చాలి. దాంతో వారు మరింత ఉత్సాహంగా హోంవర్క్ పూర్తి చేస్తారు.
– పిల్లలు నలుగురైదుగురు కలిసి ఒకేచోట కూర్చుని హోంవర్క్ చేసుకొనేలా వాతావరణం కల్పిస్తే మరీ మంచిది. ఒకరిని చూసి ఒకరు హోంవర్క్ తొందరగా.. ఉత్సాహంగా పూర్తి చేస్తారు.
* సమయంలోగా హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలని షెడ్యూల్ పెట్టాలి. దీనివల్ల పిల్లలకు షెడ్యూల్‌లో పనిపూర్తి చేసుకునే అలవాటు పిల్లలలో వస్తుంది.
* పిల్లలు హోంవర్క్ చేసే సమయంలో పక్కన కూర్చుని ఫోన్ మాట్లాడకూడదు. దానివల్ల వారి ఏకాగ్రత దెబ్బతింటుంది.
* మీ పిల్లలను చదువుకోవడానికి, హోంవర్క్ పూర్తి చేయడానికి.. అనువైన ప్రదేశాన్ని సృష్టించాలి. మీ పిల్లలకు అవసరమైన పెన్నులు, బుక్స్, పేపర్స్, రిఫరెన్స్ మెటీరియల్స్ వంటి అవసరమైన వస్తువులను వారికి అందుబాటులో ఉంచాలి.
– కొందరు పేరెంట్స్.. పిల్లలు హోంవర్క్ చేయడానికి మారం చేస్తుంటే.. తిడుతుంటారు, కొందరైతే ఏకంగా కొట్టేస్తారు కూడా. ఇలా చేస్తే.. మీ చిన్నారి మొడిగా తయారవుతుంది. వాళ్లతో ఫ్రెండ్లీగా మాట్లాడి హోంవర్క్ పూర్తి చేయండి.
– పిల్లలు హోం వర్క్ చేయకుంటే స్కూల్లో టీచర్లు తమ పిల్లల్ని కొడతారని కొంతమంది వాళ్ల తల్లులే చేసేస్తుంటారు. ఇలా చేయకూడదు. దీంతో పిల్లలు హోం వర్క్ చేసేందుకు ఆసక్తి చూపించరు. వాళ్లు మా అమ్మ చేసేస్తుందిలే అనే భావనలోకి వస్తారు. దీంతో వాళ్లలో నేర్చుకునే శక్తి కూడా తగ్గుతుంది. వాళ్లకు సహాయం కావలిస్తే.. చేయాలి గానీ మీరే మొత్తం హోంవర్క్ చేయవద్దు.
– పిల్లలు బట్టి పట్టి చదవకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అందువల్ల హోం వర్క్‌లో సైన్స్ ప్రాజెక్టులు చేయాల్సి వస్తే.. కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి పిల్లలకు నేర్చించాలి. పిల్లలకు బట్టీలా కాకుండా ఆ సబ్జెక్టు గురించి పూర్తి అవగాహన వచ్చే విధంగా వివరించి చెప్పాలి.