Kilaru Indu : ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా మన భారతీయుల ప్రతిభా పాఠవాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనోళ్లే అత్యంత ఉన్నత స్థితిలో ఉంటున్నారు. ప్రపంచంలోనే నంబర్ 1 టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ను నడిపించేది మన తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల. గూగుల్ కు మన దక్షిణాది తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్. ఇలా ఈ రెండు కంపెనీలే కాదు.. చాలా కంపెనీలకు సీఈవోలు, చైర్మన్లు మన భారతీయులే. అందుకే మన వారి ప్రతిభకు సాటిలేదని నిరూపితమైంది.
పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి కష్టమైనా సాధ్యమేనని నిరూపించింది మన తెలుగు యువతి ఇందు కిలారు. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఇందు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకొని తెలుగు ఖ్యాతిని చాటి చెప్పింది.
విజయవాడలో బీటెక్ పూర్తి చేసిన ఇందు అమెరికాలో ఎంఎస్ పబ్లిక్ పాలసీ చేసింది. యూనివర్సిటీ స్థాయిలో ఇచ్చిన ప్రజేంటేషన్లు, పరిశోధనలతో ఎన్నో అవార్డులు అందుకుంది. తాజాగా ఏకంగా ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకొని తెలుగు వారి ప్రతిభకు మరో అత్యున్నత పదవిని సంపాదించి పెట్టింది.