BRS తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కోకాపేట భూముల వ్యవహారం మెడకు చుట్టుకునేట్లు కనిపిస్తున్నది. ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న విచారణనే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా, ఇది బీఆర్ఎస్ తీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఎలా స్పందించాలో ప్రభుత్వానికి ఇప్పుడు అర్థం కావడం లేదు.
కోకాపేటలో 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీ కి ప్రభుత్వ అప్పగించింది. ట్రైనింగ్ సెంటర్ పేరిట వీటిని అప్పగించింది. ఎకరాకు రూ. 3 కోట్ల నామమాత్రపు ధరను ఇందుకోసం చెల్లించింది. ఆయితే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు ఈ విషయమై హైకోర్టు సంప్రదించడం, హైకోర్టు విచారణకు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సుమారు రూ. 500 కోట్ల విలువ చేసే భూములను రూ. 38 కోట్లకు కేటాయించినట్లు వారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ప్రారంభోత్సవాలు కూడా పూర్తి చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఈ విషయంలో వారు ఊహాజనిత రేటు చెబుతున్నారంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి, మరికొందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అయితే ఎన్నికల సమయంలో ఈ అంశం సంచలనంగా మారింది. కోట్లాది రూపాయల భూమిని అప్పనంగా పార్టీకి కట్టబెట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలకు డబుల్ బెడ్రూంలకు ఇండ్లు ఇవ్వలేని సర్కారు, తమ పార్టీకి మాత్రం వందల కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా కేటాయించుకోవడం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు హైకోర్టు ఏం వివరణ ఇవ్వాలనేది ఇప్పుడు తలనొప్పిగా మారింది.