Kondagattu : అఘోరా అంటేసాధువు జీవితంలో అత్యున్నత స్థితిగా వర్ణించారు. హిందూ సమాజంలో వారి పట్ల అపారమైన భక్తి, గౌరవం ఉంటాయి. కుంభమేళాలు, పుష్కరాల్లో మాత్రమే వారు ఎక్కువగా కనిపిస్తారు. సంస్కృతంలో అఘోరి అంటే ‘భయం కలిగించని’ అని అర్థం. కానీ అఘోరాల వేషధారణ, ప్రవర్తన భయానకంగా ఉంటాయి. హిందూ సమాజంలో వారిని దేవుని దూతలుగా పరిగణిస్తారు. అఘోరాలు పురుషులు మాత్రమే ఉంటారు. స్త్రీలు చాలా అరుదుగా కనిపిస్తారు. మహిళలను అఘోరీలుగా సంబోధిస్తారు.
అయితే తాజాగా జగిత్యాల జిల్లా కొండగట్టులోని అంజన్న ఆలయాన్ని ఓ మహిళా అఘోరీ దర్శించుకుంది. ఆలయ పూజారులు మహిళ అఘోరీకి స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం చేయించారు. కొండగట్టుకు చేరుకున్న మహిళా అఘోరీలను చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెను దర్శించుకున్నారు. ఐదు రోజుల క్రితం ఈ మహిళ అఘోరీ సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యక్షమై స్వామి వారిని దర్శించుకుంది. నిజానికి, అఘోరాలు తరచుగా హిమాలయ మంచు గుహలు, కాశీ క్షేత్రం, బెంగాల్, గుజరాత్ అడవులలో తిరుగుతూ తపస్సు చేస్తుంటారు.
అఘోరాలు మానవ పుర్రెలను పట్టుకుని తిరుగుతారు. ఇది వివిధ పనులకు ఒక పాత్రగా ఉపయోగిస్తారు. శరీరమంతా బూడిద రంగు పూసుకుని ఉంటారు. ఒంటి మీద బట్టలు ఉండవు. మెడలో రుద్రాక్ష హారాలు ధరిస్తారు. శివుడిని ఎక్కువగా పూజిస్తారు. వారు గంజాయి తాగుతూ కనిపిస్తారు. వారు శవాలపై కూర్చుని ధ్యానం చేస్తారు. వారికి మంచి చెడులు ఒకేలా ఉంటాయి. వారు బయటి ప్రపంచం పట్ల చాలా ఎడంగా ఉంటారు. కుంభమేళా లేదా ఆలయాల్లో ఏదైనా ప్రత్యేక పూజలు జరిగినప్పుడు ఆ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలివస్తారు.