Kottakota Road Accident : తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున కొత్తకోట రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది.ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకు వచ్చిన ఒక కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతిచెందిన వారి వివరాలలోకి వెళితే మొత్తం ఇద్దరు చిన్నారులతో పాటు ఇద్దరు పెద్దవాళ్ళు మృతిచెందారు. ఏడు నెలల వాసిత రఫా, రెండు సంవత్సరాల వయసున్న బుష్రా, ఐదేళ్ల వయసు ఉన్న మరియ తో పాటు, 85 సంవత్సరాల ఫాతిమా , 65 సంవత్సరాల అబ్దుల్ రెహమాన్ ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో 60 సంవత్సరాల షాజహాన్, 50 సంవత్సరాల హబీబున్నీసా, ఎనిమిది సంవత్సరాల హసన్ సాని, 32 సంవత్సరాల ఖదీరున్నీసా ఉన్నారు. గాయపడిన వారిని ముందు వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ వారికి ప్రధమ చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని క్షతగాత్రుల బంధువులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం బళ్ళారి బసవన్న కుంట కు చెందిన అలీ కుటుంబ సమేతంగా హైదరాబాద్ బండ్లగూడ లో పెళ్లిచూపులు చూసేందుకు తవేరా వాహనం (కే.ఏ.34పీ 7323)లో వెళ్తున్న క్రమంలో సుమారు 2.30 గంటల సమయంలో కొత్తకోట జాతీయ రహదారి లోని టెక్కలయ్య దర్గా సమీపంలో వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీ కొంది.
నిద్ర మైకం లో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని, ఇంత ప్రాణ నష్టానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం బంధువులు శోక సముద్రంలో మునిగారు.