
KTR : కొడంగల్ నియోజకవర్గంలో ఇటీవల ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడిలో మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీంతో గత రాత్రి నుంచి బీఆర్ఎస్ శిబిరంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కేటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అర్ధరాత్రి పెద్ద ఎత్తున కేటీఆర్ నివాసం వద్ద గుమిగూడారు. ఇప్పుడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ అరెస్టుకు సిద్ధమని తేల్చి చెప్పారు.
‘రేవంత్ రెడ్డి! రూ. 50 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యక్తికి అంతా కుట్రలానే అనిపిస్తుంది! మీ అల్లుడి ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతులు నిరసన తెలపడం కుట్ర! సోదరుడి బెదిరింపులకు రైతులు లొంగకపోవడం కుట్ర! ఇద్దరు వ్యక్తులు ఫోన్ లో మాట్లాడుకోవడం కుట్ర! ప్రజలు తమ బాధలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక కుట్ర! పేద గిరిజన రైతులకు అండగా నిలవడం ఒక కుట్ర!’ కదా రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు.
‘తొమ్మిది నెలలు మీ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూసిన తర్వాత, మీ బెదిరింపులన్నింటినీ ఎదుర్కొన్న తర్వాత, వారు తిరుగుబాటు చేస్తే- అది ఖచ్చితంగా కుట్ర! పేద రైతు కుటుంబాలపై అర్ధరాత్రి దాడులు, అక్రమ అరెస్టులు, చిత్రహింసలను నేను ప్రశ్నిస్తే- అది కచ్చితంగా కుట్రే! ఎందుకంటే మీరు భయంతో జీవిస్తున్నారు! జీవితంలో ప్రతి క్షణం భయంతోనే బతుకుతున్నావు’ అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ రైతులకు అండగా నిలిచినందుకు తల ఎత్తుకొని మరీ జైలుకు వెళ్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘నన్ను అరెస్టు చెయ్యండి! తెలంగాణ రైతులకు అండగా నిలిచినందుకు తల పైకెత్తి జైలుకు వెళ్తా! గొంతులేని వారి గొంతుగా మారినందుకు! జై తెలంగాణ’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ పరోక్షంగా తనను అరెస్టు చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇవ్వడంతో బీఆర్ఎస్ శిబిరంలో ఉద్రిక్తతలు పెరిగి తెలంగాణ రాజకీయాల్లో వేడి వాతావరణం నెలకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.