Lover’s High Tension :
ప్రేమజంటలు గొడవ పడడం సహజం.. మరికాసేపట్లో కలుసుకోవడం సహజం. ఇందులో ఎదుటి వారికి ఇబ్బంది ఉండదు. అమ్మాయి తనను ప్రేమించడం లేదని అబ్బాయో.. అబ్బాయి ప్రేమించడం లేదని అమ్మాయో కొంత మనస్తాపానికి గురై ఎదుటివారిని మేము చచ్చిపోతామంటూ బెదిరిస్తుంటారు. ఎలాగైనా తమ ప్రేమను అంగీకరించాలని బెదిరిస్తుంటారు. కానీ ఇక్కడ విచిత్ర ఘటన జరిగింది. గొడవ పడిన ఓ జంట టవరెక్కి హైటెన్షన్ సృష్టించింది. పోలీసలను హైరానా పెట్టించింది. ఎట్టకేలకు వారు కిందకు దిగడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఛత్తీస్గఢ్ లోని మార్వాహి ప్రాంతంలో ఓ ప్రేమజంట గొడవ పడి టవరెక్కి న ఘటన కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మార్వాహి ప్రాంతానికి చెందిన అనితా భైనా అనే యువతి అదే ప్రాంతానికి చెందిన ముఖేశ్ తో కొంతకాలం కలిసి ఉంటున్నది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే ఇటీవల ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో ముందుగా అనిత విద్యుత్ టవర్ పైకి ఎక్కింది. చస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో ముఖేశ్ కూడా టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు టవర్ వద్దకు చేరుకున్నారు. ఇక వారిద్దరూ 30 నిమిషాలపాటు హైరానా పెట్టించారు. పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమికూడారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడది వైరల్ గా మారింది. అయితే టవర్ ఎక్కిన జంట, పోలీసుల విన్నపం మేరకు కిందికి దిగారు. చిన్నపాటి గొడవకే టవర్ ఎక్కి హంగామా చేసిన సదరు జంటకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. వారి తీరుపై న్యూసెన్స్ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. ఇక మరికొందరు అమ్మాయి తరఫున.. కొందరు అబ్బాయి తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ జంట హాట్ టాపిక్ గా మారింది.