
Mahbub Nagar Review : అధికార పార్టీ బీఆర్ఎస్ కు తలనొప్పులు పెరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇంటిపోరు తప్పడం లేదు. ఈనేథ్యంలోనే ఈ నాలుగు చోట్ల సిట్టింగ్ లకు భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో అసమ్మతి జోరు పెరిగితే తమ గెలుపు అంత సునాయాసం కాదని తెలిసిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు.
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డడి కి వ్యతిరేకంగా జూపల్లి క్రిష్ణారావు వేరు కుంపటి రగిలించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు పోటీగా నాగర్ కర్నూలు ఎంపీ రాములు కొడుకు భరత్ ప్రసాద్ టికెట్ కోసం ఆశిస్తుండటంతో చిక్కుల్లో పడుతున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు పోటీగా ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి అసమ్మతి గళం విప్పుతున్నారు.
కొద్ది రోజుల్లో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల గురించి ఆందోళనలు చేస్తూ తలనొప్పులు పడుతున్నారు. అవి శ్రుతిమించి దాడుల వరకు వెళ్తున్నాయి. దీంతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాటేమిటి? అనే ప్రశ్నలు వస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉండటం, అర్హులకు దళిత బంధు రాకపోవడం వంటి వాటి గురించి ప్రశ్నలు సంధిస్తున్నారు.
దీంతో అధికార పార్టీపై నమ్మకం పోతోంది గత ఎన్నికల్లో నాగర్ కర్నూల్ మినహా అన్ని చోట్ల అరకొర మెజార్టీతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయం గమనార్హం. దీంతో ఈసారి అసమ్మతి సెగ తగులుతుండటంతో ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవడం అంత సులభం కాదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని కూడా అసమ్మతి కలవరపెడుతోంది.
బీజేపీ కూడా తన ప్రభావం చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈనేపథ్యంలో ఎమ్మెల్యేలు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అంటూ ఊళ్లు చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ వారు హాత్ సే హాత్ జోడో అంటూ తిరుగుతున్నారు.
నాగర్ కర్నూల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి జనార్థన్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నా అది అంత సులభం కాదని తెలుస్తోంది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి రూపంలో ఆయనకు గండం ఎదురు కానుంది.
అచ్చంపేట ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజుకు వర్గపోరు పెరిగింది. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కొడుకు, కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ ఆయనకు వ్యతిరేకంగా వేరు కుంపటి రగిలిస్తున్నాడు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావుతో పడటం లేదు. దీంతో వీరి ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.