Malayalam actor Arrest : అత్యాచార కేసుకు సంబంధించి మలయాళ నటుడు ఇడవేల బాబును పోలీసులు అరెస్టు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మలయాళ నటుడు, అమ్మ మాజీ ప్రధాన కార్యదర్శి ఇడవేల బాబును అత్యాచారం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా అరెస్టు చేసింది. ఓ మహిళా నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన ప్రకారం.. ఓ మహిళా నటి ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ లో ఇడవేల బాబుపై అత్యాచారం కేసు నమోదు చేశారు. బాబు అమ్మ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో అమ్మలో సభ్యత్వం కోసం కలూర్ లోని ఆయన నివాసానికి వెళ్లగా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం రేపింది. దీంతో మాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశ్రమను 10-15 మంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు నియంత్రిస్తున్నారంటూ 235 పేజీల నివేదికను అందించింది.
ఈ నివేదిక వెలుగులోకి వచ్చిన అనంతరం పలువురు సినీతారలు తమకు ఎదురైన పరిస్థితుల గురించి బయటకు వచ్చి మాట్లాడారు. ఈ క్రమంలోనే నటుడు జయసూర్య, సిద్దిక్, ముఖేష్, మణియన్ పిల్లై రాజు, దర్శకుడు రంజిత్ తో సహా ప్రముఖ నటులు, చిత్ర నిర్మతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది.