
Manchu Mohan Babu : ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జల్పల్లిలోని తమ నివాసానికి సంబంధించిన వివాదంలో గతంలో మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తన కుమారుడు మంచు మనోజ్ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు గతంలో కోర్టును ఆశ్రయించారు. మనోజ్ తనను ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.
ఈ కేసులో గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా ఎల్బీనగర్ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, మోహన్ బాబు కోర్టును తప్పుదోవ పట్టించారంటూ మంచు మనోజ్ తరపు న్యాయవాది తాజాగా కొన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం, గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
ఇది మాత్రమే కాకుండా, ఈ వ్యవహారంలో పొరపాటుకు పాల్పడిన కోర్టు క్లర్క్‌కు న్యాయస్థానం మెమో జారీ చేసింది. ఈ పరిణామం మంచు కుటుంబంలో నెలకొన్న వివాదానికి మరింత ఊతమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసుపై తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి.