First wife : తిరుమలలో హైదరాబాద్ కు చెందిన యువకుడి రెండో పెళ్లి వివాదం కలకలం రేపింది. నిత్య కల్యాణం పచ్చని తోరణంలా ఉండే తిరుమల క్షేత్రంలో పెళ్లిని అపహాస్యం చేయాలనుకున్న రాకేష్ అనే యువకుడి నీచత్వాన్ని మొదటి భార్య బట్టబయలు చేసింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలానికి చెందిన గంగవోళ్ల రాకేష్‌కు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన పెండ్యాల సంధ్యతో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. 29 ఏప్రిల్ 2016న సంధ్యను వివాహం చేసుకున్న రాకేష్‌కు 7 ఏళ్ల కుమార్తె మాన్వి కూడా ఉంది. 2021 నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరూ కోర్టు మెట్లు ఎక్కారు. హనుమకొండ కోర్టులో డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005 కింద కేసు కూడా పెండింగ్‌లో ఉంది. అయితే ఇంతలోనే రాకేష్ రహస్యంగా రెండో పెళ్లికి సిద్ధమవుతుండగా.. మొదటి భార్య ఎంట్రీ ఇచ్చింది. తిరుమలలోని సిద్ధేశ్వర మఠంలో జరుగుతున్న రెండో పెళ్లిని ఆమె ఆపేశారు. భర్త రాకేష్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న మొదటి భార్య సంధ్య తిరుమలకు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్న భర్త బండారాన్ని బయట పెట్టింది సంధ్య. ఏడేళ్ల కూతురు మాన్వితో కలిసి తిరుమలకు వచ్చిన సంధ్య.. భర్త రెండో పెళ్లి వేడుక జరుగుతున్న మఠానికి చేరుకుంది. సంధ్య ఎంట్రీతో వరుడి అవతారం తీసుకున్న రాకేష్‌కి ఊహించని షాక్ తగిలింది. వెంటనే అక్కడి నుంచి పరారు కాగా.. సంధ్య తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టులో ఉండగానే విడాకులు తీసుకున్నట్టు నమ్మంచి మరో మహిళను పెళ్లి చేసుకుంటున్నాడని సంధ్య ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త ఇంట్లో ఉండాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. తనను కొట్టి వెళ్లగొట్టారని సంధ్య ఆరోపిస్తోంది. రాజకీయ సంబంధాలున్న తన భర్త ఇంట్లోకి వస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని సంధ్య ఆరోపించింది.