KTR Comments : అమృత్ పథకం టెండర్ల అక్రమాలపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కటీఆర్ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎంపీలతో కలిసి సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. అమృత్ పథకం టెండర్లలో తన బావమరిది సృజన్ రెడ్డికి లబ్ధి చేకూరేలా సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలకు సంబంధించి సమగ్ర వివరాలున్న లేఖను మంత్రికి అందజేశారు.
సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోద కంపెనీకి రూ.1100 కోట్ల టెండర్లను ఏకపక్షంగా కట్టబెట్టారని ఫిర్యాదులో తెలిపారు. రూ.2 కోట్ల లాభం కూడా లేని కంపెనీకి ఇంత పెద్ద టెండర్ ఇవ్వడం వెనుక ఏదో గోల్ మాల్ జరిగిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. టెండర్లు రద్దు చేయాలన్నారు. కేటీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, మాజీ ఎంపీలు బాల్క సుమన్, మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఉన్నారు.






