
Flying Boat: భారత సంతతికి చెందిన సంప్రీతి భట్టాచార్య నావిగేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. నావినార్ సంస్థ ఫౌండర్, సీఈవోగా ఉన్న ఆమె ఎలక్ట్రిక్ హైడ్రోఫోయిల్ బోట్ ‘నావియర్ 30’ని ఆవిష్కరించి నేవిగేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. చదువుకునేందుకు ఎన్నో కష్టాలు పడిన ఆమె అన్నింటినీ జయించింది.
అన్ని ప్రతికూలతల మధ్య
సంప్రీతి కోల్‌కత్తాలో పుట్టి పెరిగింది. ఆమె విద్యాభ్యాసం, బాల్యం అక్కడే గడిచింది. ఇంటర్ లో ఫిజిక్స్(భౌతిక శాస్త్రం) చదవాలని కోరిక ఉన్నా.. అందులో ఆమె ఫెయిలవుతూ వచ్చింది. ఇక ఆమె టీచర్ చదవును మధ్యలో ఆపేసి పెళ్లి చేసుకోవాలని సూచించింది. కానీ అది ఆమెకు నచ్చలేదు. తర్వాత జాదవ్ పూర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదవాలని నిర్ణయించుకుంది. 540 ఇంటర్న్ షిప్ ల కోసం దరఖాస్తు చేసుకోగా, 539 మంది తిరస్కరించారని ఆమె ‘నాస్ డైలీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికాలోని ఫెర్మిలాబ్ అనే పార్టికల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ఆమెకు అవకాశం దక్కింది. అక్కడ ఇంటర్న్ షిప్ కోసం చేయాలని అమెరికాకు వెళ్లింది. అక్కడ రీసెర్చ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కాలంలోనే సంప్రతీకి మళ్లీ ఫిజిక్స్ పై ఇష్టం పెరుగుతూ వచ్చింది.
ఆ తర్వాత ఆమె మరో ఇంటర్న్ షిప్ పొందింది. నాసా వద్ద రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధనలో పనిచేసింది. నాస్ డైలీకి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆమె స్టీవ్ జాబ్స్ ను ఉటంకిస్తూ, ‘స్టీవ్ జాబ్స్ చెప్పినట్లు ఈ ప్రపంచం నువ్వూ, నీ కన్నా తెలివైన వాళ్లే నిర్మించారు. అలాంటప్పుడు సాహసోపేతమైన నిర్ణయాలు, పనులు ఎందుకు చేయకూడదు? నీకు ఏ రంగాన్ని ఎంచుకుంటావో ఆరంగంలో టాప్ పొజిషన్ లో ఉండాలి, అందుకు కష్టపడాలి’. అంటారు.
2010లో కేవలం 200 డాలర్లతో అమెరికాకు వెళ్లిపోయింది సంప్రీతి. ఆమె మాస్టర్స్ లో చేరింది. ఒహియో స్టేట్ యూనివర్సిటీ ఆ తర్వాత పీహెచ్‌డీ కోసం ఎంఐటీలో చేసింది. అక్కడ ఆమె హైడ్రోస్వార్మ్ అనే అండర్ వాటర్ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. ఇది సముద్రపు అడుగు భాగాన్ని మ్యాప్ చేయగలదు గనులను గుర్తించగలదు. ఆమె వివిధ పోటీలు మరియు హ్యాకథాన్లలో కూడా పాల్గొంది. అక్కడ ఆమె తన సహ వ్యవస్థాపకుడు రియో బెయిర్డ్ ను కలుసుకుంది. 2020లో, వారు హైడ్రోఫోయిల్స్, విద్యుదీకరణ, అధునాతన మిశ్రమాలు, ఇంటెలిజెంట్ సాఫ్ట్ వేర్ వ్యవస్థను మిళితం చేసే కొత్త రకం వాటర్ స్ర్కాఫ్ట్ రూపొందించాలనే లక్ష్యంగా పెట్టుకొని ‘నావియర్’ అనే సంస్థను ప్రారంభించారు. ‘నావియర్ 30’ విమానం వంటి నిర్మాణంతో నీటిపై ఎగిరేలా రూపొందించబడింది, ఇది గ్లైడింగ్ కదలికకు సహాయపడుతుంది. దీనికి 3 రెక్కలు ఉంటాయి. ఇవి నీటి ఉపరితలం కింద పని చేస్తాయి, అధిక వేగంతో వెళ్తున్నప్పుడు పడవను పైకి లేపుతాయి. ఇది సముద్రపు అలలపై మరింత వేగంగా వెళ్లేందుకు ఉపయోగపడుతుంది.
బోటింగ్ ను మరింత అందుబాటులోకి, చౌకగా, సుస్థిరంగా చేయడమే సంప్రీతి దార్శనికత. నీటిపై ప్రజలు ప్రయాణించే విధానాన్ని మార్చాలని, సముద్ర రవాణా వల్ల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించాలని ఆమె కోరుకుంటున్నారు. వివిధ ఇన్వెస్టర్లు, మీడియా సంస్థలు, ఇన్ ఫ్లూయెన్సర్ల నుంచి గుర్తింపు, మద్దతు లభించింది. వాటిలో ఒకటి నాస్ డైలీ, ఇది ఆమె గురించి ఒక వీడియోను రూపొందించింది: ‘ఆమె ఎగిరే పడవను నిర్మించింది! ఆమె పడవ నేను చూసిన అత్యంత చల్లనిది. సంప్రతి భట్టాచార్య 13 ఏళ్ల కష్టానికి తిరుగులేని విజయగాథ’’ అన్నారు. అదే ఇంటర్వ్యూలో ఫెర్మిలాబ్స్ తనకు అవకాశం ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు ఏమి చేస్తారని అడిగినప్పుడు, ఆమె మరో 500 కంపెనీలకు ఇమెయిల్ చేస్తానని బదులిచ్చింది ఇది ఆమె స్ఫూర్తికి నిదర్శనం.
తమ కలలను సాకారం చేసుకొని ప్రపంచంలో మార్పు తేవాలనుకునే ప్రతి ఒక్కరికీ సంప్రతి భట్టాచార్య స్ఫూర్తిగా నిలుస్తుంది. పట్టుదల, సంకల్పం, సృజనాత్మకత ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తుంది ఆమె. ‘మీరు ఏమి చేయగలరో లేదా ఏమి చేయలేరో మీకు ఎవరూ చెప్పద్దు. నీకు నచ్చింది నువ్వు చేయాలి.’ అని చెప్పింది.