megastar chiranjeevi : ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై చిరంజీవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమా టికెట్ల పెంపు విషయంలో జగన్ ను కలిసిన చిరంజీవినేనా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని కీర్తించారు మెగాస్టార్. జగన్ నిర్ణయంతో ఎవరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపకున్నా తను తెలుపుతానని ఆయనే వచ్చి కృతజ్ఞతలు తెలిపిమరీ ప్రశంసించారు. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడడంతో బహుషా ఎన్నికల ఎఫెక్ట్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న చిరంజీవి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం సరికాదు. సినీ పరిశ్రమపై ఈ ప్రభుత్వం పడడం మంచిది కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులు, రోడ్లు, పథకాలు, ప్రత్యేక హోదాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. విద్యా, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజల మనసుల్లో శాశ్వతంగా ఉండిపోతారని వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలిస్తే తలవంచి నమస్కరిస్తారని చిరంజీవి వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. వీటిని విన్న వైసీపీ కార్యకర్తలు, నేతలు ఒకప్పుడు జగన్ వద్ద చేతులు కట్టుకొని కూర్చున్న చిరంజీవీనేనా ఇలా మాట్లాడేది అని కామెంట్లు పెడుతున్నారు. సీఎంతో చిరంజీవి చివరి భేటీ ఇతర స్టార్ హీరోలతో కలిసి జరిగింది. అయితే ఆ సమయంలో మెగాస్టార్ ను అవమానించారంటూ మెగా ఫ్యాన్స్, కొంత మంది ఇండస్ట్రీ పెద్దలు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి ఎవరికి మద్దతు అన్న ప్రశ్న ఒక దశలో తలెత్తింది. దీంతో ఆయన బహిరంగ సభ సాక్షిగా తన తమ్ముడికే-జనసేనకే మద్దతు అంటూ స్పష్టం చేశారు. అయితే ఈ ఈవెంట్ లో జగన్ ప్రభుత్వంపై మండి పడిన చిరంజీవిని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.