
MLC Kavitha : ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో బెయిల్‌పై 165రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవిత విడుదల అయ్యారు. కవితను అరెస్టు చేసి నేటికి 164 రోజులు కాగా.. జ్యుడిషీయల్ కస్టడీలో భాగంగా ఆమె 153 రోజులు తీహార్ జైలులోనే ఉన్నారు. ఈ నెల 27న బెయిల్ పొందిన ఆమె బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కవిత అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీతో ఆమెకు స్వాగతం పలికారు. ఆమె రాకతో కుటుంబంలో భావోద్వేగం వాతావరణం నెలకొంది. తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టారు. అయితే గురువారం తండ్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అయితే కవిత బెయిల్ రావడం పై రాజకీయ నాయకులు తలోరకంగా మాట్లాడుకుంటున్నారు.
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల విలీనం కారణంగానే కవితకు బెయిల్ వచ్చిందని బండి సంజయ్ కామెంట్ చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఇదే కేసులో మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్‌లకు ఎందుకని బెయిల్ రాలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే దీనికి బీఆర్ఎస్ నేతలు కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు. రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం వల్లే ఓటుకు నోటు కేసు ఆలస్యం అయిందంటూ బీజేపీ విమర్శించింది. మనీష్ సిసోడియాకు బెయిల్ వస్తే తప్పుడు కేసు అని రాహుల్ గాంధీ అంటున్నారని, అదే కేసులో కవితకు బెయిల్ వస్తే ఎలా విమర్శిస్తారంటూ విమర్శించారు.
కవిత బెయిల్ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉందనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ నేతలపై కేటీఆర్ లాబీయింగ్ చేశారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు కేంద్రంలో కీలకంగా మారడంతో బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో తెరవెనుక ఆయన మద్దతు తీసుకున్నట్లు సమాచారం. కవిత అనారోగ్యం దృష్ట్యా.. మహిళ అనే సెంటిమెంట్ దృష్ట్యా చంద్రబాబు కూడా ఆమె పట్ల సానుకూలంగా స్పందించడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను బీఆర్‌ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. కవిత తప్పుడు కేసు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.