
ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణికి పద్మశ్రీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నిన్న రాత్రి పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. మొత్తం 91 మందికి పద్మశ్రీ ప్రకటించగా అందులో ఎం ఎం కీరవాణి పేరు కూడా ఉండటం గమనార్హం. కీరవాణికి వరుసగా పలు అవార్డులు వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంతో చాలా సంతోషంగా ఉన్నాడు. కీరవాణి కుటుంబానికి దక్కిన గౌరవాన్ని చూసి ఉప్పొంగిపోతోంది.
కీరవాణి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి. అయితే సినిమాల్లో మాత్రం ఎం ఎం కీరవాణి అనే పేరుతో సంగీతం అందిస్తుంటాడు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడిన కీరవాణి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించాడు. తెలుగులోనే కాకుండా తమిళ , హిందీ చిత్రాలకు కూడా సంగీతం అందించాడు. ఇక ఇటీవల ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా కీరవాణి పేరు మారుమ్రోగుతోంది. ముఖ్యంగా నాటు నాటు అనే పాట యావత్ ప్రపంచాన్ని ఉరూతలూగిస్తోంది.
ఇటీవలే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు దక్కించుకుంది నాటు నాటు అనే పాట. ఇక ఇప్పుడేమో ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. మార్చి 13 న అసలు సమరం తేలిపోనుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మరో నాలుగు పాటలతో కలిసి పోటీ పడుతోంది నాటు నాటు సాంగ్. ఇక కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ విషయానికి వస్తే ……. సినిమా సాహిత్యానికి కీరవాణి అందించిన సేవలను గుర్తించి పద్మశ్రీతో సత్కరిస్తోంది. కీరవాణికి పద్మశ్రీ ప్రకటించడంతో పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు కీరవాణిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.