
Monkey pox in Mahanadu : టీడీపీ నిర్వహించుకునే అతిపెద్ద పండుగ మహానాడుకు నేడు రాజమహేంద్రవరం గోదావరి తీరం వేదిక కానుంది. రెండు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి ఇప్పటికే టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సభా ప్రాంగణానికి తరలివచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ సభా ప్రాంగణంలోనే మూడు రోజులపాటు బస్సులోనే బస చేయనున్నారు. పెద్ద సంఖ్యలో తరలిరానున్న నాయకులు, కార్యకర్తల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది తరలివస్తారని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు సభా ప్రాంగణానికి తరలిరాగా గోదావరి తీరం కిటకిరలాడుతున్నది.
పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పలు తీర్మానాలు, రానున్న ఎన్నికలు, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తదితరాలపై ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు.అయితే మహానాడుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త కలకలం రేపుతున్నది. టీడీపీ మహానాడు ప్రాంగణంలో ఇద్దరికీ మంకీ పాక్స్ సోకినట్లు ఈ వార్త సారాంశం. వీరిని హుటాహుటిన స్థానిక దవాఖానకు తరలించినట్లు అందులో ఉంది. అయితే ఇది సోషల్ మీడియాలో పుకారా.. నిజమేనా అనేది తెలియాల్సి ఉన్నది. దీనిని ఎవరూ ధ్రువీకరించడం లేదు.
మరోవైపు దీనిని టీడీపీ శ్రేణులు కొట్టి పడేస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదని చెబుతున్నాయి. టీడీపీ మహానాడుకు జనం తరలి రాకుండా చేసేందుకే కొందరు ఇలాంటి కుట్రలకు బరితెగించారని మండిపడుతున్నాయి. అయితే టీడీపీ మహానాడు ప్రాంగణంలో మంకీ పాక్స్ కలకలం అని ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రస్తుతం అంతా చర్చ సాగుతున్నది. దీనిని చూసి వైసీపీ శ్రేణులు షేర్ చేస్తూ సంబురపడుతున్నాయి. మరి.. మహానాడులో మంకీ పాక్స్ నిజమో.. కాదో కాసేపట్లో తేలనుంది.