Operation Moranchapalli :
భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం, మోరంచపల్లి గ్రామం సమీపంలోని చెరువుకు వరద పోటెత్తడంతో గ్రామంలోని ఇళ్లల్లోకి నీరు చేరి విలవిలలాడుతోంది. గ్రామ సమీపంలోకి వాగుకు వరద పోటెత్తడంతో నీరు దారి మళ్లింది. దీనికి తోడు బుధవారం రాత్రి కూడా కుంభవృష్టి కురవడంతో గ్రామంలోకి వరద నీరు చేరింది. అది క్రమ క్రమంగా పెరుగుతూ పోయింది. చివరికి గురువారం ఉదయం వరకు గ్రామస్తులు వరదలో చిక్కుకుపోయారు. వరద గ్రామంలోకి చొచ్చుకురావడంతో ప్రజలు ఇళ్లను వదిలి పైకప్పులను చేరుకొని కాపాడాలని ఆర్థనాదాలు చేస్తున్నారు.
గ్రామంలోని 1500 వందల మందికి పైగా వరదలో చిక్కుకున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. వరద ముంచెత్తడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి చీకటిలోనే గడిపింది గ్రామం. దీనికి తోడు తమ సామగ్రి కూడా వరదలో కొట్టుకుపోయిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కట్టుబట్టలతో మిగిలామని విలపిస్తున్నారు. గ్రామం చుట్టూ వరద చేరి అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉండడంతో పోలీసులు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది.
విషయం తెలుసుకున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ప్రజలను రక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామంలో చాలా మంది చనిపోయినట్లు గ్రామస్తులు విలపిస్తూ వీడియోలను మీడియాకు పంపుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరికొద్ది సేపట్లో గ్రామానికి చేరుకుంటాయని అధికారులు చెప్తున్నారు. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో గ్రామస్తులు మరింత ఆందోళన చెందుతున్నారు.