Mudragada Padmanabham : కాపు ఉద్యమాలతో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత టీడీపీ ప్రభుత్వంలో తుని రైలు దహనం ఘటనతో చర్చల్లోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేయడంతో విపక్ష వైసీపీని ఆశ్రయించి మద్దతు పొందారు.
ఇది కాస్తా ఎన్నికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా పనిచేసింది. దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉంటున్న ముద్రగడ కొంత కాలంగా చేస్తున్న వ్యాఖ్యలు క్రియా శీలక రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కాబోతున్నట్లు తెలుస్తున్నది.
కొద్ది రోజులుగా పవన్ పై ముద్రగడ చేస్తు్న్న విమర్శలు, సవాళ్లు ఏపీ అధికార పార్టీ వైసీపీకి మద్దతుగా ఉన్నాయని కాపు నేతలే పేర్కొంటున్నారు.అయితే ముద్రగడ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి తన ముసుగు తొలిగించుకుబోతున్నారని పుకార్లు వస్తున్నాయి.
గతంలో చంద్ర బాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు కాపు ఉద్యమాన్ని చేపట్టారు. సరిగ్గా ఎన్నికలకు ముందు కాపు రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను అని బాహాటంగా ప్రకటించిన జగన్ కి మద్దతు ఇవ్వడమే కాకుండా, జగన్ అధికారం లోకి రాగానే తాను కాపు ఉద్యమాన్ని వదిలేస్తున్నట్లు అధికారికంగా ముద్రగడ ప్రకటించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు ప్రభుత్వం పై పోరాడుతున్నపుడు తనకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తో కానీ ఆ పార్టీతో కానీ ఎటువంటి సంబంధం లేదు అని పదే పదే చెప్పిన ముద్రగడ చాలా సంవత్సరాల పాటు పార్టీలకు అతీతంగా కాపుల హక్కుల కోసం పోరాడుతున్నట్లు నమ్మించగలిగారు. 2019 తర్వాత కొద్ది కొద్దిగా ముద్రగడ పద్మనాభం తన క్రెడిబిలిటీని కోల్పోతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన ముసుగు కొద్ది కొద్దిగా తొలుగుతూ వస్తోంది.
జగన్ ముఖ్య మంత్రి కాగానే కాపుల హక్కుల గురించి ఒక్క నాడు కూడా ఆయనను ప్రశ్నించకపోవడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే కాపు ఉద్యమాన్ని అటకెక్కించడం తో కొంత వరకు క్రెడిబిలిటీ ని పోగొట్టుకున్న ముద్రగడ పద్మనాభం, ఇటీవల వైఎస్ఆర్సీపీ నేత ద్వారంపూడి చంద్ర శేఖర రెడ్డి తనకు, తన ఉద్యమానికి గతంలో నిధులు సమకూర్చారని చెప్పి తన క్రెడిబిలిటీ ని పూర్తిగా కోల్పోయారు. ఆయన చేసిన ప్రకటన కాపు యువతను తీవ్ర అసహనానికి గురి చేసింది.
దీనికి తోడు కాపు సామాజిక వర్గానికి ప్రస్తుతం ఆశా కిరణం గా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వకపోగా, ఆయనకు వ్యతిరేకంగా ముద్రగడ వైఎస్ఆర్సీపీకి కి ప్రయోజనం కలిగించేలా పనిచేస్తున్నాడనే ప్రచారం కూడా కాపు సామాజిక వర్గానికి ఆయనను దూరం చేస్తున్నది. ఇంత కాలంగా తాను పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని చేస్తున్నట్లు ముసుగు వేసుకున్న ముద్రగడ ఇప్పుడు ఆ ముసుగు ను పూర్తిగా తీసి వేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తున్నది.
వైసీపీలో చేరేందుకు సన్నాహాలు:
కొంత కాలంగా వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా మరి కొంత మంది వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభం తో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు తుది దశకు వచ్చినట్లు సమాచారం. ముద్రగడ పద్మనాభం అధికారికంగా వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
కాకినాడ ఎంపీ స్థానానికి కానీ, తూర్పు గోదావరి జిల్లా లోని మరి ఏదైనా అసెంబ్లీ స్థానానికి కానీ ముద్రగడకు వైసీపీ టికెట్ లభించే చాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ముద్రగడ పద్మనాభం ను అధికారికంగా తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీకి కొంత కాలంగా దూరమైన కాపు సామాజిక వర్గాన్ని తిరిగి తమ వైపు మళ్లించుకోవచ్చని వైసీపీ భావిస్తున్నది.
2009లో ప్రజా రాజ్యం పార్టీ వచ్చిన కొత్త లో పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం అంతటి రాజశేఖర్ రెడ్డి హవాలో కూడా మూడో స్థానానికి పరిమితం కావడం, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగ గీత చేతిలో చిత్తుగా ఓడిపోవడాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
ముద్రగడ పద్మనాభం వల్ల వైసీపీకి పెద్దగా ప్రయోజనం లభించకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి ముద్రగడ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది, ఆయన చేరిక వైసీపీకి మేలు చేస్తుందా లేక మరింత నష్టం చేకూరుస్తుందా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.






