Nagababu Tweet : ఓ డ్యాన్సర్ ను లైంగికంగా వేధించాడనే ఘటన బయటికి వచ్చినప్పటి నుంచి ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు టాలీవుడ్‌లో మార్మోగుతున్న విషయం తెలిసిందే. తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు ఇటీవల జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును నార్సింగి ఠాణాకు బదిలీ చేశారు. సెప్టెంబర్ 19న ఉదయం బెంగళూరులో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు బృందం జానీ మాస్టర్ ను బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకు వస్తున్నట్లు తెలిసింది.
జానీ మాస్టర్ అరెస్టు తర్వాత సినీ నటుడు నాగబాబు ఎక్స్(ట్విట్టర్) లో చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. ‘కోర్టులో నేరం రుజువయ్యే దాకా ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’ అని బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో కొటేషన్‌ను నాగబాబు ట్వీట్ చేశారు. ‘మీరు విన్న ప్రతి దానిని నమ్మొద్దని, ప్రతి కథకు మూడు కోణాలు ఉంటాయని, మీ వైపు, నా వైపు మరియు నిజం’ అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్‌ను కూడా మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ రెండు ట్వీట్లలో జానీ మాస్టర్ ను నాగబాబు ఉదహరించకపోయినా వాటి అర్ధాలను చూస్తే జానీ మాస్టర్ కోసమే ట్వీట్ చేసినట్లుగా ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం సర్ విలియం గారో, రాబర్ట్ ఎవాన్స్ కొటేషన్‌లను నాగబాబు ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జానీ మాస్టర్ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అదే సమయంలో మెగా కుటంబంతోనూ జానీకి మంచి అనుబంధం ఉన్నది. జానీ మాస్టర్‌కు నాగబాబు మద్దతు ఇస్తున్నారా అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ ట్వీట్ ఆంతర్యం అలాగే ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు.