
Nara Lokesh Comments : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి ఆయన కుమారుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన తండ్రి రాజకీయ విలువలు, వ్యక్తిత్వం గురించి లోకేష్ ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు.
నారా లోకేష్ రాజకీయాల్లోకి వస్తున్న సమయంలో తండ్రి చంద్రబాబు ఆయనతో చెప్పిన మాటలను లోకేష్ గుర్తు చేసుకున్నారు. “కత్తి పట్టినవాడు కత్తితోనే చస్తాడు. ఆ రాజకీయాలను నేను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. అది నా రాజకీయం కాదు” అని చంద్రబాబు స్పష్టం చేశారట.
73 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని, ఆయన మనస్సాక్షి నిర్మలంగా ఉందని లోకేష్ అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని ఆయన గట్టిగా చెప్పారు.
చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు జైలులో ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మద్దతు లభించిందని లోకేష్ గుర్తు చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 45 వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారంటే చంద్రబాబుపై వారికి ఉన్న అభిమానం, నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 27 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేశారని లోకేష్ పేర్కొన్నారు. అయితే, చంద్రబాబు నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటే హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే ముందు ఆయన వెయ్యి ఎకరాలు కొనుక్కునేవారని, అప్పట్లో ఎకరం కేవలం 50 వేల రూపాయలు మాత్రమే ఉండేదని ఆయన అన్నారు. కానీ చంద్రబాబు అలా చేయలేదని, ఆయనకు స్వార్థం లేదని లోకేష్ స్పష్టం చేశారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు ఏమాత్రం అధైర్యపడలేదని, ఒక యువకుడిలా తనకంటే వేగంగా ప్రజల్లో తిరుగుతున్నారని లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ విలువలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన నిజాయితీని ప్రజలు గుర్తించారని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. నారా లోకేష్ తన తండ్రి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి.