బీఆర్ఎస్ అభ్యర్థి: పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి : క్లారిటీ లేదు
బీజేపీ అభ్యర్థి : స్పష్టత లేదు
——————————
Narsampet Constituency Review : నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి దొంతి మాధవ రెడ్డిపై సుమారు 16 వేల మెజార్టీతో విజయం సాధించారు. మాధవరెడ్డి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి అపజయం పాలయ్యారు.
ఇక్కడ కాంగ్రెస్ రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1957, 1967లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. వామపక్ష నేత మద్దికాయల ఓంకార్ ఐదుసార్లు విజయం సాధించారు. మూడుసార్లు సీపీఎం పక్షాన గెలిచి తరువాత ఎంపీసీఐ ఏర్పాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా రెండుసార్లు గెలిచారు. 1994లో టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి చేతిలో 87 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. నర్సంపేటలో ఏడు సార్లు రెడ్లు, ఐదుగురు బీసీ నేతలు గెలిచారు. రెండుసార్లు ఇతరులు విజయం సాధించారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డికే విజయావకాశాలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. సమస్యల పరిష్కారంలో ఆయన ముందుంటున్నారని ప్రజల్లో వాదనలు వస్తున్నాయి.
కాంగ్రెస్ నుంచి దొంతి మాధవరెడ్డి బరిలో నిలవనున్నారు. బీజేపీ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డికే టికెట్ ఖాయమనుకున్నా ఆయన సోదరి ఝాన్సీ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు జరగనుందని తెలుస్తోంది. కాంగ్రెస్ లో కూడా వర్గ పోరు నడుస్తోంది. ఈ క్రమంలో టికెట్లు ఎవరికి దక్కుతాయో తెలియడం లేదు.
నర్సంపేట నియోజకవర్గంలో గెలవాలని మూడు పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార పార్టీ నుంచి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దొంతి మాధవరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్లు ఖాయమైనా సొంత పార్టీలోనే అసమ్మతి కుంపట్లు రగులుతున్నట్లు సమాచారం. దీంతో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది.