Anjani Kumar :
తెలంగాణలో ఎన్నికల హడావుడి కనిపిస్తున్నది. అన్ని ప్రధాన శాఖల్లో అధికారుల బదిలీలు పూర్తయ్యాయి. మరికొందరి బదిలీ ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే తెలంగాణలో ఎన్నికల లోగా కొత్తగా డీజీపీ రావడం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న అంజని కుమార్ ఏపీ క్యాడర్ అధికారి. ఈ నేపథ్యంలో ఆయనపై ఇప్పటికే కోర్టులో పిటిషన్లు ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై హైకోర్టుకు కేంద్రం కూడా ఒక నివేదిక సమర్పించింది. దాని ప్రకారం అంజని కుమార్ ఏపీకి పోవాల్సిందేనని పేర్కొంది. గతంలో సీఎస్ సోమేశ్ కుమార్ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పే అంజని కుమార్ కు వర్తిస్తుందని కేంద్రం అందులో పేర్కొంది. అయితే ఇతర పక్షాల వాదనలు కూడా వినేందుకు హైకోర్టు ఈ విచారణను రెండు వారాల వరకు వాయిదా వేసింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలంగాణకు కొత్త డీజీపీ వస్తారని ప్రచారం ప్రస్తుతం బయటకు వస్తున్నది.
ఇటీవల బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తర్వాత సివిల్ సర్వీస్ అధికారుల కేడర్ వివాదం పై ఉన్న పిటిషన్ ను త్వరగా పరిష్కరించాలని కేంద్రం హైకోర్టును కోరింది. దీంతో కోర్టు విచారణను మళ్లీ ప్రారంభించింది. తెలంగాణలో సుమారు 12 మంది ఏపీ క్యాడర్కు చెందిన అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక వీరంతా ఏపీకి వెళ్లాల్సిందేనని సమాచారం.
అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం విషయంలో బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తున్నది. దీంతో డీజీపీ ని సాగనంపే విషయంలో కేంద్రం కొంత వెనక్కి తగ్గినట్లు సమాచారం. అయితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీకి ఇబ్బందులు ఎదురైతే మాత్రం స్థానిక నాయకులకు ఫిర్యాదు మేరకు కేంద్రం రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. ఆ వెంటనే డీజీపీ మార్పు ఇక తథ్యమనే వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఈ అంశం ఉన్నందున డీజీపీని ఏపీకి పంపిస్తుందా.. లేదంటే ఇక్కడే కొనసాగిస్తుందా అనే అంశం త్వరలోనే తేలనుంది.