
Jagan Delhi tour : ఏపీలో పొత్తులు మారేలా కనిపిస్తున్నాయి. ఢిల్లీ కేంద్రం ఇక తుది చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన దోస్తీ ఖాయమైనప్పటికీ బీజేపీని కూడా కలిసి రమ్మని అడుగుతున్నాయి. అయితే బీజేపీతో కలిసి నడిచేందుకు అటు వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఆయన శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సమయంలో పొత్తులపై కూడా ఢిల్లీ లోని బీజేపీ పెద్దలతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం.
పొత్తుల కోసమే ఢిల్లీ టూర్..
ఏపీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పటికే జనసేన, టీడీపీ బంధం బహిర్గతమైంది. బీజేపీ తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని ఆ రెండు పార్టీలు చూస్తున్నాయి. అయితే బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే కేంద్రం నుంచి ఈసారి జగన్ కు ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చేసి కట్టుదిట్టం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కేంద్రంకు అండగా నిలిచి తనకు అనుకూలంగా మార్చకోవాలని చూస్తున్నారు.
శుక్రవారం ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాలను ఆయన ప్రత్యేకంగా కలవనున్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నా, ఏపీ సీఎం జగన్ మాత్రం ప్రధానికి అండగా నిలిచారు. విపక్షాలు కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చి, విమర్శల పాలయ్యారు.
అయితే బీజేపీతో సఖ్యతకు ఏపీ సీఎం జగన్ ప్రాధాన్యతనిస్తున్నట్లు అర్థమవుతున్నది. బీజేపీ అధిష్ఠానం కూడా సీఎం జగన్ పై కొంత సాఫ్ట్ కార్నర్ తో వెళ్తున్నది. ఎన్నికలకు ఏడాదికి ముందు ఏపీకి భారీగా నిధులు కేటాయించJడం కూడా ఇందులో భాగంగానే కనిపిస్తున్నది. అయితే జగన్ మాత్రం ప్రస్తుతం ఢిల్లీ టూర్ ను రాజకీయంగా వాడుకునేందుకు వ్యూహాత్మక అడుగులువేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయనే ప్రచారం నేపథ్యంలో ఆయన బీజేపీతో సఖ్యతకు అడుగులు వేయడం కొత్త పొత్తులపై చర్చకు తెరలేపుతున్నది. మరి ఈ మూడు రోజుల్లో ఎవరి మనసు ఎటు మారుతుందో వేచి చూడాల్సి ఉంది.