
Josh In Congress : తెలంగాణ కాంగ్రెస్ లో జోరుగా సంపూర్ణంగా కనిపిస్తున్నది. కొన్ని రోజులుగా సీనియర్లంతా కలిసికట్టుగా కనిపిస్తుండడంతో, శ్రేణులంతా సంబురపడుతున్నాయి. కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి పది మెట్లు దిగేందుకు అయినా సిద్ధమేనని ప్రకటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆచరణలో కూడా అదే చేస్తున్నారు. సీనియర్లు, జూనియర్లను కలుపుకొని పోతున్నారు. సీట్ల విషయంలో కూడా తాను జోక్యం చేసుకోనని, అధిష్టానం అంతా చూసుకుంటుందని చెప్పి, మరింత పేరు తెచ్చుకున్నారు. అయితే తాజాగా పొంగులేటి, జూపల్లిని రేవంత్ రెడ్డి కలిశారు. పార్టీలో వారి చేరిక ఖాయమైన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసి, సాదరంగా ఆహ్వానించారు. ఈ సమంయలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, చిన్నారెడ్డి రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. కోమటి రెడ్డి కొంత కాలంగా రేవంత్ ను విమర్శిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఇద్దరు కలిసికట్టుగా వెళ్లడం, మీడియా కు ఇద్దరు కలిసి మాట్లాడడం శ్రేణుల్లో జోష్ నింపింది.
దీంతో పాటు కొన్ని రోజులుగా మిగతా సీనియర్లు కూడా రేవంత్ రెడ్డిని కలుపుకొని పోతున్నారు. అధిష్టానం చెప్పిందో లేదంటే ఈ సారి పార్టీ అధికారంలోకి రాకపోతే కష్టమవుతుందని అనుకున్నారో తెలియదు కాని అంతా కలిసి టీపీసీసీ చీఫ్ తో కలిసి ముందుకు సాగుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా కొంత వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తున్నది. కేసీఆర్ ను ఢీకొట్టాలంటే రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన భావిస్తున్నారు. ఈసారి రాష్ర్ట ప్రజలు కూడా కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఆయన వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యూహాలు బీఆర్ ఎస్ నేతలను ముప్పుతిప్పలు పెడుతున్నట్లు గా తెలుస్తు్న్నది. ఇప్పటికే పార్టీలో చేరికల జోష్ పెంచారు. అభ్యర్థులు లేని చోట, కొంత బలహీనంగా ఉన్న చోట రేవంత్ టీం ఇప్పటికే పని మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. ఆయా చోట్ల బలమైన అభ్యర్థులను పార్టీ వైపు తిప్పుకునే పనిని ఇప్పటికే ఆయన టీం చేపట్టినట్లు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ లో ఆజోష్ కనిపించడం లేదు. ఓ వైపు దశాబ్ది ఉత్సవాలు జరుగుతుంటే ఆ రెండు పార్టీల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. బీఆర్ఎస్లో ఎంతో కాలంగా పదవులు ఆశిస్తు్న్నవారు ఇప్పుడు ఆలక బూనారు. ఇక బీజేపీ కొన్ని రోజులుగా యాక్టివ్ గా ఉన్నట్లుగా కనిపించడం లేదు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని జరుగుతున్న ప్రచారాన్ని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు. కొన్ని రోజులుగా ఇరు పార్టీల నేతలు విమర్శలు చేసుకోవడం లేదు. కేసీఆర్ పై ఎదురుదాడికి దిగే బండి సంజయ్ కూడా కొంత సైలెంట్ అయ్యారు. అయితే కేసీఆర్ కూడా ఇదే పంథాను పాటిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో కొందరి వ్యవహారం పార్టీకి తలనొప్పి గా మారింది. మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో తాత్సారం కూడా బీఆర్ఎస్ పై వ్యతిరేకతకు కారణమవుతున్నది. ఇక కేంద్రంలోని బీజేపీ తీరు తెలంగాణలో ఆ పార్టీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నది. ఏదేమైనా ఈసారి కాంగ్రెస్ లో కనిపిస్తు్న్న జోష్ మిగతా రెండు పార్టీల్లో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.






