CM Jagan Office Vizag : ఏపీలో మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దసరా నుంచి ఇక తన మకాం విశాఖకు మార్చబోతున్నట్లుగా ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. దసరా పండుగను వైజాగ్ లోనే చేసుకుందామని సహచరులకు ఇప్పటికే సీఎం చెప్పారట. ఇక ఇటీవల వైసీపీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ అక్టోబర్ 23 నుంచి జగన్ విశాఖ నుంచే పాలన కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు.
అయితే దీనిపై తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. కేవలం సీఎం ఆఫీస్, క్యాంపు కార్యాలయాలు, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, నివాసాలు, అవసరమైన సిబ్బంది క్వార్టర్స్ తదితరాల ఏర్పాట్లలో చాలా బిజీగా ఉన్నారని సమాచారం. అయితే వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే జగన్ ఇక్కడ ఉంటారని తెలుస్తున్నది. గురు, శుక్రవారాల్లో మాత్రమే విశాఖలో ఉంటారని టాక్. మిగతా రోజులు అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో తాను పర్యటిస్తారని సమాచారం. అయితే ప్రస్తుతానికి పరిపాలనా రాజధానిగా మాత్రమే విశాఖను ఎంచుకుంటున్నామని గతంలోనే ప్రభుత్వం చెప్పింది.
అయితే మూడు రాజధానుల అంశానికి సాంకేతికంగా న్యాయస్థానంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులోనూ పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం తరలిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని జగన్ భావిస్తున్నారని సమాచారం.
అయితే ఎన్నికల నాటికి వైజాగ్ ను రాజధానిగా చేయాలనేది వైఎస్ జగన్ మనసులో మాటగా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ దిశగా ఆయనకు అనుకూలంగా ఉన్న అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఉద్యోగులందరికీ వైజాగ్ వెళ్లడం ఇష్టం లేదని, విజయవాడ నుంచే పాలన కొనసాగిస్తే బాగుండనే అభిప్రాయం ఉన్నట్లు సమాచారం. మరి జగన్ వైఖరికి భయపడే అంతా సైలెంట్ గా ఉంటున్నట్లు తెలుస్తున్నది. ఇక జగన్ ఎక్కడుంటే అక్కడే ఏపీ రాజధాని అని వైసీపీ మంత్రలు కలరింగ్ ఇస్తున్నారు. అయితే ప్రజల్లో మాత్రం ఇంకా తమ రాజధాని అమరావతే అనే భావన కనిపిస్తున్నది.