NRI TDP donates : ఎదుటి వ్యక్తికి కష్టం వచ్చిందంటే చాలు మీమున్నాం అన్న భావన బహూసా భారతదేశం నుంచి వచ్చిందేమో. దేశంలో ఏ మూల ప్రజలకు కష్టం వచ్చినా ఆదుకునేందుకు అందరూ ఒక్కటవుతారు. అంతెందుకు దేశమే కాదు.. విదేశాలలో సైతం అందరూ ఒక్కటై కష్టాలను ఎదుర్కోవడంలో సాయం చేస్తారు. మొన్నటికి మొన్న కేరళలోని వయనాడ్ లో వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారితో పాటు చాలా మంది మరణించారు. వీరి కోసం దేశం యావత్తు కదిలింది. ఎక్కడెక్కడి నుంచో వారి కోసం విరాళాలు అందాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదల కారణంగా ఇటు తెలంగాణలో ఖమ్మం, అటు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ అతలాకుతలం అయ్యింది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. నీటితో పరిసరాలు నిండిపోయాయి. తమను ఆదుకోవాలని ప్రజలు ప్రభుత్వం వైపు ధీనంగా చూశారు. దీంతో ప్రభుత్వం కూడా ముందుకు కదిలింది. ప్రతీ ఒక్కరినీ శరణార్థి శిబిరాలకు తరలించడంతో పాటు వారికి అన్న పాణాదులు అందజేశారు. సత్వరమే సహాయక చర్యలు తీసుకున్నారు. అయినా ఎంతో మంది ఇండ్లల్లోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి చాలా ఇబ్బంది పడ్డారు. వీరి కోసం ప్రభుత్వమే కాదు.. విదేశాలలో ఉన్న వారు సైతం విరాళాలు అందజేశారు.
నార్త్ అమెరికాలోని ఎన్ఆర్ఐ టీడీపీ శ్రేణులు ఏపీలోని వరద బాధితుల కోసం విరాళాలు సేకరించారు. నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ‘AP CM Relief Fund’కు ₹25 లక్షల విరాళాన్ని అందించారు. ఈ మొత్తానికి సంబంధించి చెక్కును శుక్రవారం (సెప్టెంబర్ 13)న డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌కు అందజేశారు. పార్టీ కోసమే కాకుండా.. ప్రజల కోసం కూడా పరితపించే కార్యకర్తలు కేవలం టీడీపీలోనే ఉన్నారని డా. పెమ్మసాని పేర్కొన్నారు. ఈ విరాళాలు అందజేసిన వారికి పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు.