
NTR death behind : శక పురుషుడిగా కీర్తి గడించిన నందమూరి తారక రామారావు జీవితం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి దాయకమే. కష్టాలలో పుట్టి పెరిగిన ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కతూ విజయ తీరాలను చేరాడు. తను పని చేసే రంగం ఏదైనా అందులో తన మార్కును చూపించే వారు ఎన్టీఆర్. చదువునుకునే సమయంలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా ఉన్న ఎన్టీఆర్ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా దానికి కట్టుబడి పని చేశాడు. సబ్ రిజిస్ట్రార్ గా తన వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరికి న్యాయం చేసేవారు ఎన్టీఆర్.
సినిమా రంగం వైపు మనసు లాగడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు ఆయన. అక్కడ కూడా తన మార్కును వదిలారు ఎన్టీఆర్. వందలాది సినిమాల్లో వేలాది పాత్రలు పోషించారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అనేక పాత్రల్లో కనిపించిన ఆయన తెలుగు జాతి గౌరవాన్ని దశ దిశలా చాటారు. దేశం యావత్తు ఎన్టీఆర్ వైపు చూసేది. ఆయన కంచుకంఠం, హావ భావాలు, డైలాగ్ డెలివరీ ఇవన్నీ మరో వ్యక్తిలో లేవంటే సందేహమే లేదు. ఎంతటి వారినైనా తన వాక్చాతుర్యంతో కన్విన్స్ చేయగల సత్తా అతనిది.
తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. నిత్యం సమావేశాలు, సభలు, పాదయాత్రలతో గడిపేవారు. 9 జనవరి, 1983లో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే ప్రభుత్వంలోకి తెచ్చిన వ్యక్తి ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. అలా చాలా కాలం తెలుగు ప్రజలను సీఎంగా ఏలిన ఆయన ఎన్నో విలక్షణమైన పథకాలు తెచ్చి హౌరా అనిపించుకున్నారు. తన పార్టీలోకి తన అల్లుడు చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు ఎన్టీఆర్. సాధారణ కార్యకర్తగా వచ్చిన చంద్రబాబు ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడన్న అపవాదు మూటగట్టుకున్నాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ చీలిక ఒక సంచలనం. ఎన్టీఆర్ లేకుండా పార్టీని ఊహించని వారు సైతం ఎన్టీఆర్ ను పక్కనపెట్టే రోజులు వచ్చాయని మాట్లాడుకోవడం ఆయనను బాగా కుంగదీసింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడే అనేది బహిరంగ సీక్రెటే. కుటుంబ సభ్యులను ఏకతాటిపైకి తెచ్చి ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి పైన నిందలు వేస్తూ పార్టీని తన గుప్పిట్లోకి తీసుకున్నాడు బాబు. ఎన్టీఆర్ చంద్రబాబును ఔరంగజేబుతో పోలుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నో లక్ష్యాలతో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తన తర్వాతి వారసుడిగా ఎన్నడూ చంద్రబాబును చూడలేదు.
ఎన్టీఆర్ ఉన్నన్ని రోజులు తనకు పార్టీ పగ్గాలు, సీఎం పీఠం దక్కదని భావించిన బాబు ఎన్టీఆర్ ను పక్కకు తప్పించేందుకు వ్యూహాలు రచించారు. వైస్ రాయ్ హోటల్ లో ఎమ్మెల్యేలను సమావేశ పరిచి ఏక పక్షంగా తనకే మద్దతివ్వాలని తాయిలాలు కూడా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో పార్టీ పూర్తిగా బాబు చేతుల్లోకి వెళ్లిపోయింది. పార్టీతో పాటు గుర్తు (సైకిల్)ను కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. తర్వాత మామ చావును కూడా వాడుకొని ఓట్లు రాబట్టి చివరికి సీఎం కుర్చీలో కూర్చుకున్నాడు. తర్వాత పార్టీలో ఎన్టీఆర్ గుర్తులను పథకాలను మెల్ల మెల్లగా చెరిపేస్తూ వచ్చారు బాబు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలుగువారి పథకం రూ. 2కే కిలో బియ్యం ఎత్తివేశారు. మద్య నిషేదాన్ని తొలగించారు. ఇలా ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఎన్టీఆర్ జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేసి ఇప్పుడు బాబు మాత్రమే అనేలా ఉన్నారు.
కానీ తెలుగు జాతి మాత్రం ఆయనను మరువడం సాధ్యం కాదు. సినిమాల్లో అభిమాన హీరోగా, ప్రజలను పాలించే గొప్ప నాయకుడిగా ఆయన ఉన్నన్ని రోజులు తెలుగు ప్రజల కంట్లో కన్నీరు కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. పథకాలు రచించినా.. తెలుగు వారి మనుసుల నుంచి ఎన్టీఆర్ అన్న పదాలను ఎవరూ తురిచేయలేరనేది చెరిగిపోని నిజం.