
ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ కు దారి తీసింది. ఎన్టీఆర్ మావాడే అంటే మావాడు అంటూ ఏపీలోని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు ఘర్షణలకు దిగుతున్నారు.అయితే విజయవాడలో మరోసారి శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘర్షణ చోటుచేసుకుంది. విజయవాడ పటమట లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వైసీపీ నేత దేవినేని అవినాష్ పేరిట అనుచరులు ఎన్టీఆర్ ఫొటోలతో బ్యానర్లు కట్టారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వాటి చుట్టూ తమ బ్యానర్లు కట్టారు. ఈ నేపథ్యంలో అవినాష్ ఇటు గద్ద రామ్మోహన్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ మా వాడు అంటే మా వాడు అంటూ ఇరువర్గాలు బల ప్రదర్శనకు దిగాయి.
నిన్న రాత్రి విజయవాడలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ చోటు చేసుకున్నది. టీడీపీ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవినేని నెహ్రూతో ఎన్టీఆర్ కు అనుబంధం ఉన్నమాట వాస్తవమే అయినా నాడు పసుపు జెండానే ఎన్టీఆర్ పార్టీవ దేహం మీద కప్పారని పేర్కొన్నారు. నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కార్యాలయం పై విజయవాడలో దాడులు చేశారని, పార్టీ జెండాను కింద పడేసి తొక్కారని విమర్శించారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని తొలగిస్తే అవినాష్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగే ఎన్టీఆర్ విగ్రహం వద్ద వైసీపీ ప్లెక్సీలు పెట్టడం ఏంటని నిరదీశారు. ధన బలం రౌడీయిజంతో ఏమైనా చేయొచ్చు అనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అవినాషే ఘర్షణలకు తావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసు అధికారులు కూడా స్పందించడం లేదని ఆరోపించారు.
మరోవైపు అవినాష్ మాట్లాడుతూ తాము ముందు నుంచి ఎన్టీఆర్ అభిమానుల మేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు తమకు ఉందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీ సొత్తు కాదని పేర్కొన్నారు. అక్కడ అందరూ ఫ్లెక్సీలు కట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వివాదాన్ని రేపి తమపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. వారే ధన బలం, సొంత మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని, మా వర్గీయుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.