
Jagan Appearance : 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ అతి పెద్ద పాదయాత్ర చేశారు. ప్రజలతో మమేకమౌతూ గడిపారు. నేనున్నా.. నే విన్న.. అంటూ తన ప్రచారాన్ని కొనసాగించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ హామీలు కుమ్మరిస్తూ పాదయాత్ర కొనసాగించారు. కష్టం ఎదురైనా.. కాలు నొప్పి వేధించినా పాదయాత్రలో ప్రజలతోనే సాగుతూ ముందుకు నడిచారు. ఈ పాదయాత్ర జగన్ కు మైలేజీని తెచ్చిపెట్టింది. ఈ పాదయాత్ర అయన అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైంది.
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. నాడు ప్రజల్లోనే నడిచిన వైసిపి అధినేత.. నేడు వారి వైపే చూడడం లేదని అపవాదు మూటగట్టుకున్నారు. కేవలం తన కార్యాలయానికి పరిమితమై పాలన కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన పర్యటనలు అంటే కూడా ప్రజలు దగ్గరికి రాకుండా భారీకేడ్లు కట్టి, కంచెలు వేసి పోలీసులు ఆపుతున్నారు. గత ప్రభుత్వాల హాయంలో ఇలా కంచెలు వేసిన సందర్భాలు అరుదు. సీఎం అయ్యాక జగన్ ఇలా ప్రజలకు దూరం కావడం ఇప్పుడు విమర్శలకు తావిస్తున్నది.
కేవలం బహిరంగ సభల్లో ప్రసంగాలు కానిచ్చేసి బటన్లు నొక్కుతూ సంక్షేమమంటూ ప్రచార ఆర్పాటానికి మాత్రమే పోతున్నారు. నాడు గుర్తించిన జనం సమస్యలను మాత్రం పరిష్కరించిన సందర్భాలు లేవు. నేను ప్రజల్లోనే ఉంటానని తరచూ జిల్లా పర్యటనలు చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు అసలు పట్టించుకోవడమే లేదు. తొమ్మిదేళ్ల కాలంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని ప్రజల తో పాటు ఆయన సొంత పార్టీల నేతలే చెబుతున్నారు 9 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్లాలని సొంత పార్టీ అసంతృప్త నేతలు చెబుతున్నారు
జిల్లాలో, గ్రామాల పర్యటనల్లో కేవలం పథకాలు, ప్రారంభోత్సవాలు చేస్తే సరిపోదని ప్రజల్లో మమేకమై వారి కష్టాన్ని తెలుసుకోవాలని కోరుతున్నారు. తమతో ఉంటాడని అధికారమిస్తే ఇలా చక్రవర్తిలా ప్రవర్తిస్తాడని అనుకోలేదని మరికొందరు బహిరంగంగానే చెబుతున్నారు. మరి ఇప్పటికైనా జగన్ తన పర్యటనల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటారో లేదో వేచి చూడాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాగే జగన్ ప్రవర్తన కొనసాగితే పార్టీకి కూడా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది.
తమ సమస్యలు చెప్పుకునేందుకు సీఎం ఆఫీస్ కు వెళ్లినా లోనికి అనుమతించడం లేదని పలువురు కార్యాలయం బయటనే కూర్చుండిపోతున్నారు రోజుల తరబడి అక్కడే ఉన్నా జగన్ చూపు తమవైపు పడడం లేదని కొందరు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఎన్నికల సంవత్సరం జగన్ ఇలాగే వ్యవహరిస్తే మొదటికే చేటు ఖాయం. టీడీపీ నేతలకు కావాల్సింది ఇదే..






