AP go Back Ten Years : ఏపీలో గతమెంతో ఘనం అన్నట్లుగా సాగింది. గతంలో పాలించిన ముఖ్యమంత్రులందరూ ఏపీని అభివృద్ధి వైపు నడిపించారనే ప్రశంసలు మూటగట్టుకున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో అయితే తెలంగాణ ప్రాంత నిధులను కూడా ఏపీకి మళ్లించి అభివృద్ధి చేసుకున్నారనే అపవాదు కూడా వారికే ఉంది. 2019 ఎన్నికల వరకు కూడా ఏపీ అభివృద్ధి నినాదమే ఎత్తుకొని ముందుకు సాగింది. మరి ఇప్పుడే మైంది.
2019లో ఎన్నికల తర్వాత ఏపీలో విధ్వంసక పాలన సాగుతున్నదనే టాక్ బయటకు వస్తున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా, ఏపీ వెనుకబాటుకు గురైంది. ఏకంగా ఏపీ పదిహేనేళ్లు వెనక్కి వెళ్లిందని వివిధ రంగాల ప్రముఖులు మొత్తుకుంటుంటే, మాకు ఇవేమి పట్టవన్నట్లుగా రాష్ర్ట ప్రభుత్వ పెద్దలు అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, రాష్ర్ట ప్రయోజనాలను ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టి ముసిముసిగా నవ్వుతున్నారు. ప్రజల ఆక్రందనలను పట్టని ఈ నేతలు, ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేశారు. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే మా అభివృద్ధి నినాదం అంటూ బటన్లు నొక్కే పాలన ప్రజలకు అందిస్తున్నారు. ఇక్కడ నొక్కేది బటన్లు కాదు.. అప్పులతో ప్రజల పీకలు అని అర్థమయ్యేసరికి ఏపీ ఓటరు అగాథంలోకి వెళ్లి పోయాడు.
పక్కరాష్ర్టాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అభివృద్ధిలో దూసుకెళ్తుంటే, ఏపీ మాత్రం ఫ్యాక్షన్ పాలకుల నీడన నిద్రపోతున్నది. ప్రజలకు ఏం చేశారని అడిగితే, నోరు తెరిస్తే కేసులు పెట్టడమే పనిగా పెట్టుకొని పాలనను కొనసాగిస్తున్నది. ఏపీ ప్రజలు 2019లో ఒక్క చాన్స్ పై నమ్మకం పెట్టుకొని ఇచ్చిన ఒక్క తీర్పు ఇప్పుడు వారి పాలిటా శాపంగా మారిందనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఏదేమైనా ఇప్పుడు ఈ నాలుగేళ్లలో ఏపీ ఎక్కడ ఉంది..? ఏపీ రాజధాని ఏంటి..? ఏపీకి వచ్చిన కంపెనీలెంటి..? ఏపీలో పెరిగిన భూముల ధరలు ఎంత..? ఏపీలో జరిగిన అభివృద్ధి ఎంత..? ఈ లెక్కలు తేల్చగలరా..? ప్రజల నుంచి అన్యాయంగా వసూలు చేసిన సొమ్మును వారికే చిల్లర రూపంలో అందజేస్తూ, మేం సంక్షేమ సారథులం అని గొప్పలు చెప్పుకోవడం మినహా, నాలుగేళ్లలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు ఏంటో ఈ ప్రభుత్వం చెప్పగలదా..? గత ప్రభుత్వాలు కట్టిన నిర్మాణాలకు. కట్టడాలకు రంగులు వేసుకోవడం మినహా వీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా అంటూ జనం ప్రశ్నిస్తున్నది.
ఏదేమైనా నాలుగేళ్లలో ఏపీ పదేళ్లు వెనక్కి వెళ్లిందనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఇక గెలవలేమని తలిచే ప్రతిపక్షాలపై ఎదురు దాడికి దిగిందనే అభిప్రాయం వినిపిస్తున్నది. ప్రజల్లో మహారాజుగా ఉన్న చంద్రబాబును హీరో నుంచి జీరోగా చేయాలనే తలంపుతోనే ఆధారాల్లేని కేసుల్లో అభియోగాలు మోపి జైలు పాలు చేసిందనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఏదేమైనా గత ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యతిరేక టాక్ ను సంపాదించుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారు.