
Padmavati Park : టీటీడీ నిర్లక్ష్యం, పోలీసుల అలసత్వం తిరుపతిలో జరిగిన ఘోర ప్రమాదానికి కారణం అయ్యాయి. తిరుపతి నగర ప్రజలకు టోకెన్లు జారీ చేసే కేంద్రంలోకి భారీ ఎత్తున స్థానికేతరులను అనుమతించడమే దుర్ఘటనకు కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుందనే భక్తుల విశ్వాసానికి తగ్గట్టుగా టీటీడీ ఏర్పాట్లు చేయకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జరిగిన బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద జరిగిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు ఉత్తరాంధ్రకు చెందిన వారు కాగా మరొకరు బళ్ళారి చెందిన మహిళ ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన మహిళలు ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
బుధవారం ఉదయం క్యూలైన్లలోకి జనాన్ని అనుమతించక పోవడంతో పోలీసులు వారందరిని పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి పంపారు. సాయంత్రానికి అక్కడ పదివేలమంది వరకు పోగయ్యారు.భక్తుల్ని పార్కులోకి ఉంచేసి గేట్లను మూసేయడంతో లోపల ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. బుధవారం రాత్రి 7.30-8 గంటల ప్రాంతంలో ఓ మహిళ అస్వస్థతకు గురైంది.
అప్పటికే తమను బయటకు పంపాలని కొందరు భక్తులు పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన మహిళను బయటకు తీసుకు వచ్చేందుకు గేట్లను తెరిచారు. ఆ సమయంలో భక్తులను పోలీసులు అప్రమత్తం చేయలేదు. పార్కు లోపల ఉన్న వారికి గేట్లు ఎందుకు తెరుస్తున్నారో తెలియక టోకెన్ల కోసం క్యూ లైన్లలోకి పంపుతున్నారని భావించారు.
పార్క్ గేటు నుంచి క్యూ లైన్లలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా జనం తోసుకు వెళ్లారు. పద్మావతి పార్కులో వాకింగ్ ట్రాక్ నిర్మించి ఉంది. ట్రాక్‌కు కింద ఉన్న లాన్‌కు అడుగున్నర ఎత్తు తేడా ఉంది. ట్రాక్ మీదుగా గేటు బయటకు రావాల్సి ఉంటుంది. గేటు వైపుకు వచ్చే క్రమంలో లాన్ నుంచి పైకి ఎక్కే క్రమంలో కొందరు కిందపడిపోయారు. జనం తోసుకుంటూ వారి మీదుగా వెళ్లిపోయారు.ఆ సమయంలో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. దాదాపు 15నిమిషాల పాటు తీవ్ర తొక్కిసలాట తర్వాత కింద పడిన వారిని అతికష్టమ్మీద బయటకు తీసుకు రాగలిగారు. గేట్లను తెరవడంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే ఈ అనర్థానికి కారణమైంది.






