
Pakistan colony : ఆంధ్రప్రదేశ్ లో పాకిస్తాన్ పేరుతో ఓ కాలనీ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. గుంటూరులో ప్రముఖమైన జిన్నా టవర్ చుట్టూనే పెద్ద వివాదం చెలరేగింది. పాకిస్తాన్ జాతిపిత పేరుతో టవర్ ఉందంటూ అప్పట్లో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసి, ఆందోళనకు పూనుకున్న నేపథ్యం కూడా ఉంది. కానీ పాకిస్తాన్ పేరుతో ప్రస్తుతం పాలనా వ్యవహారాలకు కేంద్రస్థానంగా ఉన్న విజయవాడలోనే ఓ కాలనీ ఉందంటే చాలామంది ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది.
బంగ్లాదేశ్ విముక్తి కోసం ఇందిరాగాంధీ సారధ్యంలోని ఇండియా సంపూర్ణంగా అండగా నిలిచింది. ఆ సమయంలో పలువురు బంగ్లాదేశీలు తూర్పు పాకిస్తాన్ నుంచి విజయవాడకు కూడా వలస వచ్చారు. అలా వలస వచ్చిన వారంతా ప్రస్తుతం విజయవాడ నగర పాలకసంస్థ పరిధిలోని పాయకాపురంలో గుడిసెలు నిర్మించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే పాకిస్తాన్ కాలనీగా స్థిరపడింది.
ఇక తాజాగా విజయవాడలోని పాయకాపురం ప్రాంతంలోని పాకిస్తాన్ కాలనీ పేరు అధికారికంగా భగీరథ కాలనీగా మారింది. పాత పేరుతో ఉన్న ప్రతికూల భావనలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పేరు మార్పు కోసం స్థానిక ప్రతినిధులు, రాష్ట్ర సాగర్ రాజ్‌పుత్ సేవా సమితి, నివాసితులు చేసిన విజ్ఞాపనలతో ఈ మార్పు జరిగింది.
నివాసితులు పాత పేరుతో పాస్‌పోర్ట్ దరఖాస్తులు, వీసా ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశాల్లో సమస్యలను ఎదుర్కొన్నారు. పేరు మార్పు తర్వాత, సుమారు 270 కుటుంబాల్లో 60 కుటుంబాలు తమ ఆధార్ చిరునామాలను నవీకరించాయి. మిగిలిన నివాసితులు కూడా తమ చిరునామాలను త్వరగా నవీకరించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీషా సూచించారు.
అయితే, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చి. బాబూరావు, పేరు మార్పు మాత్రమే సమస్యలను పరిష్కరించదని, గృహాలను నియమితంగా చేసి, పట్టాలు జారీ చేయడం వంటి దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని పేర్కొన్నారు.






