Pakistan Student : మత మౌఢ్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది అన్ని మతాల్లోనూ ఉండడం గమనార్హం. అయితే కొన్ని దేశాల్లో అయితే మరీనూ. మతాలు, దేవుళ్ల పేరుతో మనిషిని చంపడానికి కూడా వెనకాడడం లేదు. దైవదూషణకు పాల్పడ్డాడంటూ 22 ఏండ్ల పాక్ విద్యార్థికి స్థానిక కోర్టు మరణ శిక్ష విధించడం దారుణం. ఇదే కేసులో మరో యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వాట్సాప్ మెసేజ్ లలో వారు దైవదూషణకు పాల్పడ్డట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది.
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన ఫొటోలు, వీడియోలను పాక్ విద్యార్థి సిద్ధం చేశాడు. వీటిని ఓ యువకుడు వాట్సాప్ లో షేర్ చేశాడు. ఓ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా యువకులిద్దరిపై పాక్ కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన సైబర్ నేరాల విభాగం 2022ల కేసు నమోదు చేసింది. తనకు మూడు మొబైల్ ఫోన్ నంబర్ల నుంచి ఈ సందేశాలు వచ్చాయని సదరు ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. కేసుపై విచారణ చేపట్టిన స్థానిక న్యాయస్థానం.. యువకుల చర్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది.
ఈ ఘటనపై వాస్తవిక వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు తప్పు చేస్తే ఏదో జరిమానా లేదా చిన్నపాటి జైలు శిక్ష విధించాలని.. అంతే కాని మరణశిక్ష, యావజ్జీవ శిక్ష విధించడం బాధాకరమన్నారు.