Hawaii wild fair అమెరికాలోని హవాయి దీవుల్లో కార్చిచ్చు పెద్ద నష్టాన్నే మిగిల్చింది. ఈ ఘోర విపత్తులో ఏకంగా 67 మంది కాలి బూడిదయ్యారు. వేలాది ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. వందల ఏండ్లుగా పర్యాటక నగరంగా ఉన్న హవాయి ఇప్పుడు కాలి బూడిదైంది. గొడ్డూగోదా సర్వం మాడి మాసైంది. ఎటుచూసినా కాలిన మృతదేహాలు, మంటల్లో బూడిదైన భవనాలు దారుణంగా పరిస్థితి మారింది. అమెరికాలోని హవాయి దీవుల్లో లహైనా రిసార్టు నగరం ఇప్పుడు కాలి బూడిదైంది. కన్నీటి ఆవేదన మిగిలింది.
అయితే హవాయి దీవుల సమూహంలోని లహైనా పట్టణంలో గత రెండు రోజుల క్రితం కార్చిచ్చు రాజుకుంది. హరికేన్ ప్రభావంతో భారీ ఈదురుగాలులు తోడై పట్టణమంతా క్షణాల్లోనే మంటలు విస్తరించాయి. దీంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. విషయం తెలిసి అధికార యంత్రాంగం రంగంలోకి దిగినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఘటనలో పెద్ద సంఖ్యలో వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఇంకా ఈ మంటల ధాటి కొనసాగుతూనే ఉంది. చిన్న చిన్న ప్రాణులు, పిల్లులు, పక్షులు మంటల్లో కాలిపోయాయి. 67 మంది మృతి చెందినట్లు ఇప్పటివరకు గుర్తించినా, ఇంకా మంటల కింద చాలా మంది ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు.
అయితే కార్చిచ్చు ప్రమాదంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమైనట్లు వార్తలు వస్తున్నాయి. వార్నింగ్ సైరన్లు మోగించలేదని రికార్డుల్లో తెలిసింది. అందుకు బదులుగా మొబైల్ ఫోన్లు, టీవీలు, రేడియో స్టేషన్ల ద్వారా అలర్ట్ సందేశాలు పంపించారు. అప్పటికే కార్చిచ్చు కారణంగా విద్యుత్, మొబైల్ సిగ్నళ్లు లేకపోవడం ప్రజలకు ఆ సందేశాలు చేరడం లేదు. అయితే ప్రస్తుత ఆస్థినష్టం పరంగా హవాయి చరిత్రలోనే రెండో అతిపెద్ద విపత్తుగా అధికారులు పేర్కొన్నారు. పర్యాటకంగా కీలకమైన ఈ ప్రాంతం ఇప్పుడు రూపు కోల్పోయింది. మౌయి అనే దీవిలో ఉండే ఈ ప్రాంతానికి శతాబ్దాల చరిత్ర ఉంది.