Pawan Kalyan Break : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కాలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ఏపీ కంటే తెలంగాణకు జరుగనున్నాయి. వీటి తర్వాత లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే, ఏపీలో అసెంబ్లీతో పాటే లోక్‌సభ ఎన్నికలు జరుగవచ్చు. తెలంగాణలో చూసుకుంటే 3 ప్రధాన పార్టీలు పోటీ చేయనున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దాదాపుగా విడివిడిగా తలపడనున్నాయి. దీంతో బీఆర్ఎస్ లబ్ధి పొందుతుందనే టాక్ కూడా ఉంది.
ఏపీకి వస్తే వైసీపీ ఒంటరిగా పోటీలోకి దిగనుంది. ఇక, తేలాల్సింది టీడీపీ, బీజేపీ, జనసేన. ఇవి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తాయా? లేక విడివిడిగా పోటీ చేస్తాయా? అనేది. అయితే జగన్ ను గద్దె దించేందుకు కలిసే పోటీ చేయాలని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. మరో రాష్ట్రంలో జరిగిన బీజేపీ మిత్రపక్షాల సమావేశం అనంతరం ఇక్కడ ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందన్న కొత్త వదన అందుకున్నారు పవన్ కళ్యాణ్.
ఒకసారి జనసేన వస్తుందని, మరోసారి పొత్తుతో గెలుస్తామని చెప్తున్నారు. కానీ, టీడీపీ మాత్రం పోటీకి ఇప్పటికే సిద్ధం అవుతుంది. చంద్రబాబే తర్వాతి సీఎం అని పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తోంది. జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఏపీలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
గుంటూరు జిల్లా కేంద్రంలోని జనసేన కార్యాలయంలో మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామో త్వరలో చెబుతామని అన్నారు. అప్పటి వరకూ మీడియా సంయమనం పాటించాలని కోరారు. వైసీపీని గద్దెదించడమే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎన్నిసీట్లలో అనడంతో పొత్తు ఉంటుందని ప్రచారం ఊపందుకుంది.
టీడీపీ, బీజేపీతో అవగాహనకు రాకుండానే పవన్ సీట్ల విషయమై క్లారిటీ ఇచ్చేంత ధైర్యం చేస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు ఏపీలో వినిపిస్తుంది. ఏది ఏమైనా మూడు పార్టీల పొత్తులపై మరింత సమాచారం కావాలి. పొత్తు లేకుండానే అధికారంలోకి వస్తామనే ధీమా టీడీపీకి పెరగడం, జనసేనాని డిమాండ్లు ఎక్కువగా ఉంటే ఎవరికి వారు ఒంటరిగా బరిలో నిలిచే అవకాశాలు ఉంటాయి.