Pawan Kalyan : తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ సుప్రీంకోర్టు విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారంపై మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కల్తీ కోసం కాదని, శాశ్వత పరిష్కారం కోసమని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వివాదంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే సీఎం చంద్రబాబు తెలిపారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరగలేదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎక్కడా చెప్పలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. విచారణ జరుగుతున్న సమయంలో తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే న్యాయమూర్తులు అలా చెప్పి ఉంటారని తాను అనుకుంటున్నట్లు వివరించారు.
గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని, ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ జరుపుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. అలాగే తాను చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసం కాదని చెప్పుకొచ్చారు. లడ్డూ వివాదం కేవలం ట్రిగ్గర్ మాత్రమే అని.. రాష్ట్రంలో కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారని, రామతీర్థంలో రాముడి తల నరికారని గుర్తు చేశారు. తాను చేస్తున్నది కేవలం ప్రాయశ్చిత్త దీక్ష మాత్రమే కాదని, శాశ్వత పరిష్కారం కోరుతూ చేపట్టిన దీక్ష అని, సనాతన పరిరక్షణ బోర్ు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారంపై ఎక్కువ మాట్లాడను అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.