కమెడియన్ అలీ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. రకరకాల సినిమా క్లిప్ లను కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియో లలో పవన్ కళ్యాణ్ అలీ ని కొడుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా చేయడానికి కారణం ఏంటో తెలుసా ……. పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానని అలీ వ్యాఖ్యానించడమే.
పవన్ కళ్యాణ్ , అలీ ఇద్దరు కూడా మంచి మిత్రులు అనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభం నుండి కూడా తన సినిమాల్లో అలీ ఉండేలా చూసుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అయితే పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టడంతో విబేధాలు మొదలయ్యాయి ఇద్దరి మధ్య.
అలీకి ఎక్కువగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉండేది. అయితే 2019 ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. దాంతో అప్పుడే పెద్ద చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన అలీ వైసీపీ లో చేరడం ఏంటి ? అని. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పై కొన్ని విమర్శలు కూడా చేసాడు అలీ. దాంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యింది. ఇక ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం అలీ ని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. ఆ పదవి ఇచ్చిన జోష్ కావచ్చు లేదంటే మరింత పెద్ద పదవి కోసం కావచ్చు కానీ జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానని ప్రకటించాడు. దాంతో మరింత వేడి రాజుకుంది. ఇంకేముంది పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు అలీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు పెడుతున్నారు.