
Godavari Districts : ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు. జనసేన బలోపేతమే లక్ష్యంగా ఆయన మొదటి విడుత యాత్రకు బయలుదేరారు. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో ఖాతా తెరవాలని ఆయన భావిస్తున్నారు. దీంతో పాటు వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
అయితే సోమవారం ఆయన వారాహి యాత్రలో భాగంగా మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో అధికార వైసీపీని ఖాతా తెరవనివ్వనని ప్రకటించారు. వైసీపీ నేతల దౌర్జన్య కాండను ఇక గోదావరి జిల్లాల ప్రజలు భరించరని చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాల అభివృద్ధికి తమ వద్ద ప్రణాళిక సిద్ధమవుతున్నదని. రానున్న రోజుల్లో మ్యానిఫెస్టోలో భాగంగా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు. అయితే వైసీపీ ఇక్కడ ఖాతా తెరవనివ్వమని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో టీడీపీతో జట్టు కట్టేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాపు ఓట్లు వైసీపీ వైపు మళ్లకుండా చూస్తున్నారు. అయితే వారాహి యాత్ర మొదలైన నాటి నుంచి పవన్ ప్రసంగాలు సంచలనమవుతున్నాయి. అధికార పార్టీకి సవాల్ విసురుతూ ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి సహా మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పవన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు యాత్ర జరిగిన అన్ని ప్రాంతాల్లో పవన్ సభలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ముఖ్యంగా యువత బ్రహ్మరథం పట్టారు. దీంతో గోదావరి జిల్లాల్లో పవన్ టూర్ సక్సెస్ అయ్యినట్లేనని జనసైనికులు సంబురపడుతున్నారు.
రానున్న రోజుల్లో వైసీపీ మీద మరింత ఎదురు దాడి ఉంటుందని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జిల్లాల్లో జరిగిన నష్టాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు జనసేనాని. ఈసారి తమ పార్టీకి అవకాశం ఇస్తే ప్రజలకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవని పవన్ కళ్యాణ్.. ఈసారి గోదావరి జిల్లాల్లో వైసీపీని ఎంత మేరకు కట్టడి చేస్తారో 2024 ఎన్నికల వరకు వేచి చూడాలి.