
Pawan Wants CM : ఏపీలో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని అంతా భావిస్తున్నారు. రెండు పార్టీల మధ్య ఇప్పటికే పలు మార్లు చర్చలు జరిగాయి. అధినేతలు చంద్రబాబు, పవన్ కూడా రెండు సార్లు భేటీ అయ్యారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలన్నీ కలిసి ముందుకెళ్తాయని పవన్ ఇప్పటికే పలుమార్లు ప్రజలకు చెప్పారు. అయితే పొత్తులపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఎన్నికలకు పది నెలల సమయం ఉందని, అప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఇరు పార్టీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఇంత వరకు బాగానే ఉన్నా ప్రాంతీయ పార్టీగా టీడీపీ ఏపీలో బలంగానే ఉంది. వైసీపీ, టీడీపీలకే అక్కడి ప్రజల ఆదరణ ఉంది. ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం కూడా ఈ రెండు పార్టీలకే ఉంది. అయితే ఈ స మయంలో పొత్తులు అంటే టీడీపీ కొన్ని సీట్లు వదులుకోవాల్సి వస్తుంది. జనసేన, బీజేపీ కోసం కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చంద్రబాబు మాత్రమే సీఎం కాబట్టి ఆయన ఒప్పుకుంటారు కూడా. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. తాజాగా పవన్ కూడా సీఎం పదవి ఇస్తే తీసుకుంటానని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. పొత్తుల చర్చల సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మూడు పార్టీల్లో సంచలనంగా మారాయి.
అసలు టీడీపీ కంటే ఎక్కువ సీట్లు జనసేన గెలిచే అవకాశమే లేదు. బీజేపీ కూడా ఏపీలో అంత చాన్స్ లేదు. ఈ సమయంలో జేడీయూ అధినేత కుమారస్వామిలాగా చక్రం తిప్పాలని పవన్ భావిస్తున్నారు. హంగ్ వస్తే తానే సీఎం కావాలని భావిస్తున్నారట. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు పరిస్థితి ఏంటి.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకు కారణం ఆయన వయస్సు కూడా. తర్వాత ఎన్నికల సరికి ఆయన వయస్సు సహకరించకపోవచ్చు.
ఈసారి అధికారంలోకి వచ్చి వైసీపీ ని తునాతునకలు చేయడం ఆయన టార్గెట్. కేసుల్లో ఇరుక్కున జగన్ ను జైలుకు పరిమితం చేయడం ద్వారా ఇక టీడీపీకి, యువనేత లోకేశ్ కు మార్గం సుగుమం చేయాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఇటు జనసేన, అటు బీజేపీతో సఖ్యతతో ముందుకెళ్తున్నారు. రాజకీయ ఎత్తులు వేయడంలో చంద్రబాబు ఎంతో సీనియర్. ఇలాంటి సమయంలో పవన్ వ్యాఖ్యలు ఆయన ముందు పనిచేయలేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
చంద్రబాబును కాదని పవన్ మాట్లాడరని, ఇది కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగమేనని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ పరిణామాల్ని వైసీపీ నిశితంగా భావిస్తున్నది. ఎందుకంటే పొత్తు కుదరకపోతే లాభపడేది వైసీపీనే. మరి పవన్ వ్యాఖ్యలపై ఇటు టీడీపీ శ్రేణులయితే ఇప్పటివరకు స్పందించలేదు. ఎందుకంటే ఇరు పార్టీల నేతలు విమర్శలు చేసుకోవద్దని ఇప్పటికే అధినేతలు ఆదేశించారు. మరి ఇక ఈ పొత్తుల ట్విస్ట్ లు ఎలా ఉండబోతున్నాయోనని టెన్షన్ అందరిలో నెలకొంది.






