Pendyala Nageswara Rao Birthday Special : తెలుగు సినిమాల్లో నిలిచి ఉండి విలసిల్లే ఎన్నో పాటల్ని రూపొందించిన పెండ్యాల నాగేశ్వరరావు పుట్టిన రోజు నేడు. ఆయన్ను స్మరించుకుందాం రండి-
సినిమా సంగీత దర్శకుల్లో గొప్ప సంగీత దర్శకుల్లో ఒక కోవకు చెందిన వారు చక్కదనానికీ, చిక్కదనానికీ, కమనీయతకూ, రమణీయతకూ పెద్దపీట వేసి వాటిపై పాటల్ని నిలిపి అభిరుచికలవాళ్లకు అందిస్తారు. పెండ్యాల సరిగ్గా అలాంటి వారు. ఎన్నో పొలుపైన పాటల్నీ, విలువైన పాటల్నీ చేశారు ఆయన.
బావామరదళ్లు సినిమాలో పెండ్యాల చేసిన “నీలి మేఘాలలో గాలి కెరటాలలో” ఒక విశేషమైన పాట. ఈ పాట స్ఫూర్తితో హిందీ సంగీత దర్శకులు మదన్ మోహన్ మేరాసాయా సినిమాలో “నేనో మే బద్ రా…” అన్న పాటను చేశారు. హిందీ పాటల్ని దక్షిణాది సంగీత దర్శకులు తీసుకుంటున్న పూర్వ రంగంలో ఇలా ఒక తెలుగు పాట మదన్ మోహన్ వంటి గొప్ప సంగీత దర్శకులకు స్ఫూర్తినివ్వడం విశేషం. అంతే కాదు ఈ పెండ్యాల పాట మదన్ మోహన్ నేనో మే బద్ రా… పాటకు స్ఫూర్తి అయ్యక ఆ హిందీ పాట ఒక పాకిస్తానీ సినిమా పాటకు ఆధారమయింది! 1972లో విడుదలైన పర్‌దేశీ అనే ఓ పాకిస్తానీ సినిమాలో మెహ్దీహసన్ పాడిన “పాయల్ ఝనన్ ఝనన్ కా నగ్మా బన్ కే” పాటకు మూలం పెండ్యాల నీలి మేఘాలలో పాటే!
పెండ్యాల పాటలు తమిళ్ష్ లో కూడా బాగా ప్రబలమయ్యాయి. గుండమ్మ కథ సినిమాలోని పాటలు, “శివశంకరి” వంటివి తమిళ్ష్ నాట కూడా జనరంజకమయ్యాయి.
ద్రోహి చిత్రం తో మొదలు పెట్టి చాల సినిమాల్లో చాల చాల గొప్ప పాటలు చేశారు పెండ్యాల. ” చిగురాకులలో చిలకమ్మా…”, “ఓ నెలరాజా వెన్నెల రాజా…”, ” మోహనరాగమహా…”, “హాయి హాయిగా జాబిల్లి…”, “వాడిన పూలే వికసించెలే… “తెలిసిందిలే తెలిసిందిలే…” వంటి గొప్ప పాటలు చేశారు. జయభేరి సినిమా పాటలు మహోన్నతమైనవి. జగదేకవీరుడు సినిమాలో “శివశంకరి…” పాట పెండ్యాల ధీ శక్తికి ఒక ఉదాహరణ. దాన వీర శూర కర్ణ సినిమాలోని “చిత్రం భళారే విచిత్రం పాట” చాల ప్రత్యేకమైన పాట. ఎన్.టి. రామారావు అక్బర్ సలీం అనార్కలి సినిమా సి.రామచంద్ర సంగీతం చేసినది. అందులో గుమ్మడికి ఎస్.పి. బాలసుబ్రగ్మణ్యం పాడిన ఓ పాట పెండ్యాల చేశారు.
ముఖ్యంగా ప్రస్తావించవలసిన విషయం ఏమిటంటే పెండ్యాల తెలుగు పరిమళంతోనే గొప్ప పాటలు చేశారు. ఆయనపై ఇంగ్లిష్ ఆపై ఇతర సంగీతాల ప్రభావం పెద్దగా లేదు. మట్టి పాటల మేటి పెండ్యాల.
చిక్కటి సంగీతంతో చక్కటి పాటలు చేసిన మన తెలుగు ఘన సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు.
రోచిష్మాన్
9444012279