PHD Bharti :
సంకల్పం గొప్పదైతే ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చని నిరూపించారు సాకే భారతి. కడు పేదరికంలో పుట్టి.. అత్తారింట్లో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాన్ని అనుభవిస్తూ.. కూలీ పనులకు వెళుతూ పీహెచ్‌డీ చేసి భారతి ఎందరికో అదర్శంగా నిలుస్తుున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగమనల నాగుల గుడ్డం గూడేనికి చెందిన భారతి.. భర్త ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చేసింది. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ నుంచి కెమిస్ర్టీలో పీహెచ్‌డీ చేసింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచ పట్టా తీసుకోవడంతో ఆమె కష్టాలు, మొక్కవొని పట్టదల వెలుగులోకి వచ్చాయి. ఆమె డాక్టరేట్ పొందేందుకు పడిన కష్టాలు మీడియాలో ప్రసారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు చొరవ తీసుకున్నారు. ఆమెకు తిరుపతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఫ్యాకల్టీగా ఉద్యోగం ఇప్పించారు. భారతి పట్టుదలను మెచ్చుకున్నారు. అదేవిధంగా ఆమెకు గైడ్ గా వ్యవహరించిన యూనివర్శిటీ ప్రొఫెసర్ శోభను కూడా అభినందించారు రవిబాబు. ఓ గిరిజన తండాకు చెందిన మహిళ కెమిస్ర్టీలో పీహెచ్డీ చేయడం మామూలు విషయం కాదు. ఆమె పట్టుదల ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిందని కొనియాడారు. అయితే నేరుగా అసిస్టెంట్ ఫ్రొపెసర్‌గా నియమించాలంటే నిబంధనలు ఒప్పుకోని కారణంగా.. అసిస్టెంట్ ఫ్యాక్టలీగా నియమించాలని కోరగా.. వైస్ ఛాన్స్ లర్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్గా నియమించింది.
భారతి కుటుంబ నేపథ్యం
చిన్నప్పటి నుంచీ బాగా చదువుకోవాలనేది భారతి కోరిక. పదో తరగతి దాకా శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలో చదివింది. తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలే. ఈమె పెద్ద కూతురు . వీరందరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక మేనమామ శివప్రసాద్‌తో తల్లిదండ్రులు పెళ్లి చేశారు. భవిష్యత్ గురించి ఎన్ని కలలున్నా…ఆ విషయం ఏనాడూ భర్తకు చెప్పలేదు. అతడే ఆమె మనసును అర్థం చేసుకున్నాడు. పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు. భర్త ప్రోత్సాహంతో తమ జీవితాలను బాగు చేసుకోవడానికి భారతి కూడా ఆ దిశగా ముందుకు సాగింది.
ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే.
భర్త పరిస్థితి అంతంత మాత్రమే. అందుకే కొన్నిరోజులు కాలేజీకి వెళ్తూ, మరికొన్ని రోజులు కూలీపనులు చేస్తూనే అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. అప్పటికే ఆమెకో కూతురు గాయత్రి. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకునేది. అలాగే చదువూ, పనులు కూడా చక్కబెట్టుకునేది. రోజూ రాత్రి పొద్దుపోయే వరకూ, మళ్లీ కోడి కూయక ముందే లేచి పుస్తకాలతో కుస్తీ పట్టేది. కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి కనీసం 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడ బస్సెక్కేది. ఇన్ని కష్టాల మధ్య భారతి డిగ్రీ, పీజీ మంచి మార్కులతో పూర్తిచేసింది.