Pinapaka Constituency Review :
బీఆర్ఎస్ : రేగా కాంతారావు ( ప్రస్తుత ఎమ్మెల్యే)
కాంగ్రెస్ : పాయం వెంకటేశ్వర్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక నియోజకవర్గానికి రాష్ర్ట రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎస్టీ నియోజకవర్గమైన ఈ నియోజకవర్గం ఇప్పుడు రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావు, మూడోసారి గెలవాలని తహతహలాడుతున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగానే కాకుండా ప్రభుత్వ విప్గా, జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
అయితే రేగా కాంతారావుకు ప్రస్తుతం ఖమ్మంలో కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూరమయ్యారు. ఆయన వర్గం పూర్తిగా రేగాను వ్యతిరేకిస్తున్నది. సీఎం కేసీఆర్ కు దగ్గరైన ఎమ్మెల్యేగా ప్రస్తుం ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ ఇటీవల కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలలో రేగా ఒకరుగా ఉన్నారు. అయితే గతంలో లా పరిస్థితులు రేగాకు అనుకూలంగా లేవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 2023 ఎన్నికల్లో గెలవడం ఆయనకు కష్టంతో కూడుకున్న పని అనే అభిప్రాయం వినిపిస్తున్నది.
అయితే ఇప్పుడు పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లును ఓడించి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. అతి త్వరగానే సీఎం కేసీఆర్కు నమ్మిన బంటయ్యారు. ఇక నియోజకవర్గంలో ఆయన అనుచరుల కబ్జాలు, అక్రమాల ఆరోపణలు పెరిగిపోయాయనే అభిప్రాయం వినిపిస్తున్నది. కొంతకాలంగా ఖమ్మంలో కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆయనకు విభేదాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పినపాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది తేలాల్సి ఉంది. అయితే ప్రముఖంగా గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి,
ప్రస్తుతం కాంగ్రెస్ గూటికి చేరిన పాయం వెంకటేశ్వర్లు పేరు వినిపిస్తున్నది. అయితే వీరిద్దరి మధ్య పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన హామీలను రేగా నెరవేర్చలేదనే అభిప్రాయం నియోజకవర్గంలో బలంగా ఉంది. అయితే 2023 ఎన్నికల్లో ఎవరికి పట్టం కడుతారో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది.